తెలుగుదేశం పార్టీ సారధ్యంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఏపీలో అభివృద్దితో పాటు సంక్షేమ కార్యక్రమాలను సమాంతరంగా తీసుకు వెళ్తుంది. గతంలో చంద్రబాబు నాయుడు ప్రధానంగా అభివృద్దిపై దృష్టి పెట్టేవారు. కానీ ఈ దఫా అభివృద్దితో పాటు సంక్షేమ పథకాల అమలుపై ఎక్కువ శ్రద్ద పెడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన సంక్షేమ హామీలన్నీ ఒకొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు.
ఇప్పటికే పెంచుతామంటూ హామీ ఇచ్చిన పింఛను అర్హులందరికీ ఇస్తూ వస్తున్నారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నా కేంద్ర ప్రభుత్వం సహకారంతో నిధులు వెంట వెంటనే విడుదల అవుతున్న కారణంగా సంక్షేమ పథకాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమలు చేస్తూ వస్తోంది. ఇదే జోష్‌తో కొత్త సంవత్సరంలో మరిన్ని సంక్షేమ హామీలను నెరవేర్చబోతున్నారు.
ప్రధానంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని అమలు చేయబోతున్నారు. సంక్రాంతి కానుకగా ఈ పథకంను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. రైతులకు సంబంధించిన పెట్టుబడి సాయంను సైతం అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే ఏడాదిలో రైతు పెట్టుబడి సాయం ఇచ్చే విషయమై మంత్రి వర్గ సమావేశంలో చర్చించబోతున్నారు.
అత్యంత కీలకమైన తల్లికి వందనం పథకంను సైతం కూటమి ప్రభుత్వం వచ్చే ఏడాదిలో అమలు చేసేందుకు సిద్ధం అవుతోంది. వచ్చే ఏడాదిలో కొత్త విద్యా సంవత్సరం నుంచి ఈ నిధులు తల్లికి అందే విధంగా నిధులు రెడీ చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి ప్రభుత్వం ఏర్పాటు అయిన ఆరు నెలల్లోనే పలు పథకాలను అమలు చేసిన కూటమి ప్రభుత్వం కొత్త ఏడాదిలో మరిన్ని హామీలను నెరవేర్చే విధంగా సన్నాహాలు చేస్తోంది.