2019 ఎన్నికల సమయంలో జరిగిన వైఎస్ వివకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి దోషులెవరన్నదీ తేలలేదు.! అసలంటూ దేశంలో న్యాయం జరుగుతుందా.? అన్న ప్రశ్న, ఇదిగో ఇలాంటి కేసుల సందర్భంగానే తెరపైకొస్తుంటుంది.
వివేకానందరెడ్డి అంటే ఆషామాషీ వ్యక్తి ఏమీ కాదు. మాజీ మంత్రి, మాజీ ఎంపీ.! సుదీర్ఘ రాజకీయ అనుభవం వుందాయనకి. కాంగ్రెస్ పార్టీలో పని చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పని చేశారు. మాజీ ముఖ్యమంత్రికి సోదరుడు, ప్రస్తుత ముఖ్యమంత్రికి బాబాయ్.! అయినాగానీ, వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి కేసు విచారణ ముందుకు కదలడంలేదు.
ఎన్నికల నేపథ్యంలో ఈ హత్య కేసు అప్పట్లో రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారం కోసం వాడుకోవడానికి ఉపయోగపడింది. ‘నారాసుర రక్త చరిత్ర’ అని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తే, ‘అబ్బాయ్ కల్డ్ బాబాయ్’ అంటూ టీడీపీ పొలిటికల్ యాగీ చేసింది.
ప్రతిపక్ష నేతగా వున్నప్పుడు సీబీఐ విచారణ కోరిన వైఎస్ జగన్, ముఖ్యమంత్రి అయ్యాక మాత్రం సీబీఐ విచారణ అవసరం లేదని తేల్చేశారు బాబాయ్ హత్యకేసుకు సంబంధించి. ఈ కేసులో ఎన్నో మలుపులు.. కానీ, దోషులెవరన్నది తేలడంలేదు.
ఒకే ఒక్క మహిళ.. ఆమె న్యాయం కోసం పోరాడుతోంది. ఆమె ఎవరో కాదు, వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి. ఆమెను వెంటేసుకుని 2019 ఎన్నికల సమయంలో రాజకీయం చేసిన వైఎస్ జగన్, ఇప్పుడు ఆమెకు అండగా నిలవకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అసలు దారుణ హత్య జరిగి వివేకానందరెడ్డి చనిపోతే, గుండె పోటు.. అంటూ సాక్షి మీడియాలో ఎలా వార్త వచ్చింది.? వైసీపీ నేతలు ఎలా చెప్పగలిగారు.? అన్నదానిపై వైఎస్ జగన్ ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం శోచనీయం.
ఇక, తన హయాంలో జరిగిన హత్య ఘటనకు సంబంధించి చంద్రబాబు చిత్ర విచిత్రమైన వాదనల్ని తెరపైకి తెస్తున్నారు. ఈ కేసుని ఏపీ నుంచి తెలంగాణకు సుప్రీంకోర్టు బదిలీ చేయడంపై స్పందిస్తూ, ‘జగన్ రెడ్డీ నీ తలకాయ్ ఎక్కడ పెట్టుకుంటావ్.?’ అని ప్రశ్నించేశారు చంద్రబాబు.
నిజమే కావొచ్చు, ఈ విషయంలో వైఎస్ జగన్ ఆత్మవిమర్శ చేసుకోవాల్సి వుంది. అదే సమయంలో, చంద్రబాబు సంగతేంటి.? ఆ హత్య జరిగింది చంద్రబాబు హయాంలోనే కదా.?
ఇద్దరూ ఇద్దరే.! 60-40 బంధం.. చివరికి హత్యా రాజకీయాల్లో కూడానా.? చంద్రబాబు, వైఎస్ జగన్.. ఈ ఇద్దరి మధ్యా అవినాభావ సంబంధం ఏంటన్నది ఎలా బయటపడుతుంది.?