తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టవడాన్ని ఆ పార్టీ అను‘కుల’ మీడియా అస్సలు జీర్ణించుకోలేకపోతోంది. ఇందులో వింతేముంది.? చంద్రబాబుకి మద్దతుగా నిలవడం తప్పు కాకపోవచ్చు.! మీడియా ఎటూ పార్టీల వారీగా విడిపోయింది. చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థులపై టీడీపీ అనుకూల మీడియా అడ్డగోలు కథనాలు ప్రచారంలోకి తీసుకురావడమూ కొత్త కాదు.
అటు వైసీపీ అను‘కుల’ మీడియా, ఇటు టీడీపీ అను‘కుల’ మీడియా, రాష్ట్ర రాజకీయాల్ని భ్రష్టుపట్టించేసిన మాట వాస్తవం. ఇంకా ఆ పైత్యం కొనసాగుతూనే వుంది.. ఇది ఎప్పటికీ కొనసాగుతూనే వుంటుంది.
సినీ పరిశ్రమ రాజకీయాలకు అతీతం. సినీ పరిశ్రమలో కొందరు ఆయా రాజకీయ పార్టీలకు మద్దతిస్తుండొచ్చు. కొందరు ఆయా రాజకీయ పార్టీల్లో వుంటుండొచ్చు. సినిమా వేరు రాజకీయం వేరు. సినిమా ద్వారా రాజకీయ అంశాల్ని ప్రజల ముందుంచొచ్చు.. అది వేరే చర్చ మళ్ళీ.
కానీ, ఇప్పుడు చంద్రబాబు అరెస్టయ్యారు గనుక.. ఆ అరెస్టుపై సినీ ప్రముఖులు స్పందించలేదు గనుక, టీడీపీ అధికారంలోకి వస్తే.. ఆ ప్రభుత్వం నుంచి సీని పరిశ్రమ ఏమీ ఆశించకూడదనడం హాస్యాస్పదం. కేవలం హాస్యాస్పదం మాత్రమే కాదు, జుగుప్సాకరం కూడా.!
వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక, సినీ పరిశ్రమ నుంచి ఆయన్ని సత్కరించలేదనీ, ఆయన్ని ముఖ్యమంత్రిగా గుర్తించలేదనీ పలువురు వైసీపీ నేతలు ఆరోపించడం చూశాం. సినీ పరిశ్రమపై వైసీపీ సర్కారు సీతకన్నేయడమూ తెలిసిన విషయమే. దాన్ని అందరూ ఖండిస్తున్నారు కూడా.
రేప్పొద్దున్న, చంద్రబాబు అధికారంలోకి వచ్చాక, సినీ పరిశ్రమకి ఏపీ ప్రభుత్వం సహాయ సహకారాలు అందించదని టీడీపీ అను‘కుల’ మీడియా చెప్పడం దుర్మార్గం. ఇది బ్లాక్‌మెయిలింగ్ చర్య. దీన్ని టీడీపీ వాదనగా భావించాలా.? టీడీపీ అను‘కుల’ మీడియా పైత్యమేనని సరిపెట్టుకోవాలా.?