టీడీపీలో కింది స్థాయి నేతలు కొందరు, అలానే.. టీడీపీ కార్యకర్తలమని చెప్పుకునే కొందరు.. సోషల్ మీడియా వేదికగా జనసైనికుల్ని రెచ్చగొట్టడం అనేది ఎన్నికల సమయంలోనూ జరిగింది. కాకపోతే, ఇప్పుడది ఇంకాస్త వెకిలితనాన్ని పులుముకున్నట్లు కనిపిస్తోంది.
ఈ మొత్తం వ్యవహారానికి టీడీపీ అను‘కుల’ మీడియా ఆజ్యం పోస్తుండడం గమనార్హం. అయితే, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఒకింత బాధ్యతాయుతంగానే వ్యవహరిస్తున్నారు. కూటమిలో పార్టీలు ఐక్యంగా వుండడం ఎంత అవసరమో, చంద్రబాబు గుర్తించారు.
అయినాగానీ, లోకేష్ బ్యాచ్‌గా చెప్పుకుంటూ కొందరు టీడీపీలో, జనసైనికుల్ని రెచ్చగొట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ – జనసేన మధ్య కింది స్థాయిలో గ్యాప్ పెరుగుతూ వస్తోంది. ఇది కూటమికి ఏమాత్రం మంచిదికాదన్న భావన టీడీపీ అధినాయకత్వంలో వ్యక్తమవుతోంది.
ఒకప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. టీడీపీకి సొంతంగా మెజార్టీ వున్నా, జనసేననిగానీ, బీజేపీనిగానీ వదిలేసేంత రిస్క్ టీడీపీ చెయ్యదుగాక చెయ్యదు. చేస్తే ఏమవుతుందో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి తెలుసు.
ప్రభుత్వానికి సంబంధించిన ఏ విషయమ్మీద అయినా, ‘కూటమి’ అనే మాట్లాడుతోంది జనసేన. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలోనూ ‘చంద్రబాబు అనుభవం’ గురించి ప్రస్తావిస్తూనే వున్నారు. కూటమికి జనసేన ఇస్తున్న గౌరవం అలాంటిది.
కానీ, కొందరు టీడీపీ నేతలు, అందునా కొందరు ప్రజా ప్రతినిథులు కూడా జనసేనను విస్మరిస్తున్నారు.. లైట్ తీసుకుంటున్నారు. ఇక్కడే కూటమిలో చిన్నపాటి అలజడి రేగుతూ వస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ విషయమై ఇంకాస్త ఎక్కువ ఫోకస్ పెట్టడం టీడీపీకి చాలా చాలా అవసరం.