సంక్రాంతి పండుగను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నిజమైన పండుగలా మార్చింది కూటమి ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు, ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను ఒకేసారి విడుదల చేస్తూ ఉద్యోగుల ముఖాల్లో ఆనందం నింపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల ఖాతాల్లో దాదాపు రూ.1,100 కోట్లను ప్రభుత్వం జమ చేయడం విశేషం.
2019 నుంచి సుమారు ఐదేళ్ల పాటు పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను ఇప్పుడు క్లియర్ చేయడం ద్వారా లక్షలాది కుటుంబాలకు ఉపశమనం కలిగింది. ఈ నిర్ణయంతో సుమారు 2.25 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు, మరో 2.70 లక్షల మంది పెన్షనర్లు నేరుగా లబ్ధి పొందారు. ఒక్కో ఉద్యోగి ఖాతాలోకి వారి వేతనాన్ని బట్టి రూ.30 వేల నుంచి రూ.60 వేల వరకు జమ కావడంతో పండుగ వేళ ఇంటింటా సంతోష వాతావరణం నెలకొంది.
ఇదే సమయంలో రాష్ట్రంలోని 55 వేల మంది పోలీసులకు కూడా శుభవార్త చెప్పింది ప్రభుత్వం. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవ్ బకాయిలను విడుదల చేసి, వారి కష్టానికి గౌరవం ఇచ్చింది. అలాగే, నాబార్డు మరియు విదేశీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు రూ.1,243 కోట్ల బకాయిలను చెల్లించింది. దీంతో నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఏర్పడింది.
ఇటీవల ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసిన సందర్భంగా, పండుగలోపే బకాయిలు చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు. చెప్పిన మాటను నిలబెట్టుకుంటూ ఆర్థిక శాఖ అధికారులతో సమన్వయం చేసి వేల కోట్ల రూపాయలను విడుదల చేయడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. గత ప్రభుత్వంలో జీతాలకే ఇబ్బంది పడ్డ పరిస్థితి నుంచి, ఇప్పుడు పండుగకు ముందే బకాయిలు అందుకునే స్థాయికి రావడం పట్ల ఉద్యోగులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ఉద్యోగులు – పెన్షనర్లలో నమ్మకాన్ని పెంచుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
