తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ని నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేశారన్న విషయాన్ని ఏపీ సీఐడీ ఉన్నతాధికారి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. చంద్రబాబు ఏకంగా 13 సంతకాలు చేశారట ముఖ్యమంత్రి హోదాలో. ఐదో ఆరో సంతకాల్ని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కూడా చేశారట మంత్రి హోదాలో.
ఆధారాలు అన్నీ వున్నాయ్.. అని ఏపీసీఐడీ చెబుతోంది. అన్ని ఆధారాలూ వుంటే, చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విషయమై ఆధారాల సమర్పణ కోసం పదిహేను రోజుల సమయాన్ని అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రభుత్వం తరఫున, ఏపీసీఐడీ తరఫున ఎందుకు కోరినట్టు.?
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనేది జరిగి వుంటే, చంద్రబాబుని శిక్షించాల్సిందే. ఈ విషయంలో ఇంకో మాటకు తావు లేదు. కానీ, శిక్ష విధించాల్సింది న్యాయస్థానాలు. నేరం జరిగిందనడానికి సాక్ష్యాధారాలు సేకరించడమే పోలీసుల పని. ఏపీసీఐడీ ఎంత సమర్థవంతంగా ఆ పని చేస్తే, అంత వేగంగా చంద్రబాబు మీద నేరం నిరూపణ అయ్యేందుకు అవకాశం వుంటుంది.
అయితే, నేరాన్ని నిర్ధారించాల్సింది మాత్రం న్యాయస్థానమే. చంద్రబాబు నేరస్తుడని తీర్పునిచ్చేది న్యాయస్థానమే అయినప్పుడు, ఏపీసీఐడీ ఎలా చంద్రబాబుని దోషిగా ఇప్పటినుంచే చూడటం మొదలు పెడుతుంది.? చంద్రబాబు ప్రస్తుతానికి నిందితుడు మాత్రమే.!
అదికారులు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసేసి, ఒకింత చతురత ప్రదర్శిస్తే సరిపోదు కదా.? అని నెటిజనం ప్రశ్నిస్తున్నారు. ఇది సోషల్ మీడియా యుగం. న్యాయ వ్యవస్థపైనా, విచారణ సంస్థల తీరుపైనా, ప్రజల్లోనూ స్క్రూటినీ జరిగిపోతోంది మరి.!
కాగా, ఈ స్కామ్ వ్యవహారానికి సంబంధించి సొమ్ములు ఎటు వెళ్ళాయి.? చంద్రబాబు లేదా ఆయన కుటుంబ సభ్యులకు వాటాలు వెళ్ళాయా.? అన్న అంశాల్ని ఆధారాలతో ఎస్టాబ్లిష్ చేయకుండా, ఈ కేసుని ముందుకు కదిలించడం కష్టమేనన్నది న్యాయ నిపుణుల వాదన.
‘అధికారులెలా తీర్పులిచ్చేస్తారు.?8 అంటూ, నిన్నటి ఏపీసీఐడీ ప్రెస్ మీట్ విషయమై టీడీపీ నేతలు ఘాటుగా ప్రశ్నిస్తున్నారు.