తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎట్టకేలకు రాజధాని అమరావతిలో సొంత ఇల్లుని సమకూర్చుకుంటున్నారు. ఇందు కోసం ఐదు ఎకరాల భూమిని ఆయన కొనుగోలు చేసినట్లు వార్తలొస్తున్నాయి.
కొనుగోలు చేసిన భూమిలో, ‘భూ పరీక్షలు’ కూడా నిర్వహిస్తున్నారట. శరవేగంగా ఇంటి నిర్మాణం దిశగా చంద్రబాబు అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి, ఈ పని చంద్రబాబు ఎప్పుడో చేసి వుండాల్సింది.
2014 – 19 మధ్య కూడా చంద్రబాబు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వున్నారు. అప్పట్లోనే అమరావతి రాష్ట్ర రాజధానిగా మారింది. ఆ సమయంలోనే చంద్రబాబు, సొంత ఇంటిని అమరావతిలో సమకూర్చుకుని వుండాల్సింది. కానీ, లింగమనేని గెస్ట్ హౌస్‌ని అద్దెకు తీసుకుని, అందులో నివాసం ఏర్పాటుచేసుకున్నారు.
ఆ లింగమనేని గెస్ట్ హౌస్, కరకట్ట దిగువన వుందనీ, నదీగర్భంలో కట్టిన ఇంట్లో నివాసం వుంటూ నిబంధనలు ఉల్లంఘించారనీ, లింగమనేని గెస్ట్ హౌస్‌ని ఆక్రమించారనీ.. ఇలా చాలా చాలా ఆరోపణలు చంద్రబాబు ఎదుర్కొన్నారు.
అయినాగానీ, సొంతింటి దిశగా చంద్రబాబు అప్పట్లో ప్రయత్నం చేయలేదు. ఆ తర్వాత అధికారం పోయింది.. ప్రతిపక్ష నేతగా కూడా చంద్రబాబు, అమరావతిలో సొంత ఇంటి నిర్మాణంపై ఫోకస్ పెట్టలేదు. కానీ, ఈసారి మాత్రం సొంత ఇంటి కోసం ప్రయత్నాలు వేగవంతం చేయడం ఆహ్వానించదగ్గ పరిణామమే.
చంద్రబాబు ఇంటి నిర్మాణం సంగతెలా వున్నా, రాజధాని అమరావతి నిర్మాణం వేగంగా జరగాల్సి వుంది. ఈ ఐదేళ్ళు చంద్రబాబుకీ, రాష్ట్ర రాజధానికీ, రాష్ట్రానికీ అత్యంత కీలకం. గత ఐదేళ్ళలో రాష్ట్ర రాజధాని అమరావతి పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ఈ క్రమంలో తన ఇంటి కంటే కూడా ఎక్కువగా రాజధాని అమరావతిపై బాధ్యత తీసుకుని, రెండు మూడేళ్ళలోనే రాజధాని అమరావతిని చంద్రబాబు ఓ కొలిక్కి తీసుకురావాలని ఆశిద్దాం.