‘ఆర్‌ఎక్స్ 100’ చిత్రం తర్వాత వరుసగా నిరుత్సాహ పర్చుతూ వస్తున్న కార్తికేయ సినిమా సినిమాకు తనలోని నటుడిని మాత్రం మరింత అభివృద్ది చేసుకుంటూనే ఉన్నాడు. హీరోగానే కాకుండా విలన్‌గా కూడా నటించేందుకు ఆసక్తిగా ఉన్న కార్తికేయ కొత్త సినిమా ‘చావు కబురు చల్లగా’. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌లో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి కౌశిక్ దర్శకత్వం వహిస్తున్నాడు. స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు నేడు జరిగాయి.
అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా ఈచిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్బంగా చిత్రంలోని కార్తిక్ లుక్‌ను రివీల్ చేశారు. కార్తిక్ ఈ చిత్రంలో శవాలను రవాణా చేసే ఆంబులెన్స్ డ్రైవర్ పాత్ర బస్తీ బాలరాజు పాత్రలో కనిపించబోతున్నాడు. బస్తీ అంటేనే మాస్. అందుకు తగ్గట్లుగానే కార్తికేయ మాస్ లుక్ ఉందంటూ ఫస్ట్‌లుక్ చూసిన వారు అంటున్నారు.
ఇప్పటికే కార్తికేయ మాస్ పాత్రల్లో మెప్పించాడు. మరోసారి ఈ చిత్రంతో కుమ్మేయడం ఖాయం అనిపిస్తుంది. కార్తికేయపై నమ్మకంతో పాటు కౌశిక్ చెప్పిన కథ నచ్చడంతో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించేందుకు.. అల్లు అరవింద్ సమర్పించేందుకు ముందుకు వచ్చారు. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించబోతున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా లావణ్యత్రిపాఠి నటించే అవకాశం ఉంది. కార్తికేయకు ఈ చిత్రం కమర్షియల్ సక్సెస్‌ను తెచ్చి పెడుతుందా చూడాలి.