ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో నిధులు కేటాయించింది. 16వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రానికి మొత్తం రూ.16,627 కోట్ల గ్రాంట్‌ను మంజూరు చేసింది. ఈ నిధులు 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రారంభమై వచ్చే ఐదేళ్ల కాలంలో దశలవారీగా విడుదల కానున్నాయి.
కేటాయించిన మొత్తంలో రూ.13,302 కోట్లు బేసిక్ గ్రాంట్ కింద, రూ.3,225 కోట్లు పెర్‌ఫార్మెన్స్ గ్రాంట్ కింద అందనున్నాయి. గత ఐదేళ్లకు 15వ ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రానికి రూ.12,800 కోట్లు లభించగా, ఈసారి అదనంగా రూ.3,827 కోట్లు ఎక్కువగా కేటాయించడం విశేషంగా మారింది.
ఈ నిధులను ప్రధానంగా గ్రామాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, మురుగునీటి వ్యవస్థల అభివృద్ధి, ఘన వ్యర్థాల నిర్వహణ వంటి కీలక కార్యక్రమాలకు వినియోగించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం మొత్తం నిధుల్లో గరిష్ఠంగా 10 శాతం మాత్రమే రోడ్ల నిర్మాణం లేదా మరమ్మతుల కోసం ఖర్చు చేయవచ్చు. మిగిలిన నిధులను గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజల అవసరాలకు అనుగుణమైన పనుల కోసం వినియోగించాల్సి ఉంటుంది.
నిధుల పంపిణీలో గ్రామ పంచాయితీలకు అత్యధిక ప్రాధాన్యం లభించనుంది. మొత్తం గ్రాంట్‌లో 70 శాతం గ్రామ పంచాయితీలకు, 15 శాతం మండల పరిషత్‌లకు, మరో 15 శాతం జిల్లా పరిషత్‌లకు కేటాయించనున్నారు. దీంతో గ్రామ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊతం లభించే అవకాశం కనిపిస్తోంది.
అయితే ఈ నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం కొన్ని షరతులను కూడా విధించింది. గ్రామ పంచాయితీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు నిర్వహించడంతో పాటు, వాటికి సంబంధించిన బ్యాంకు ఖాతాల వివరాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండాలి. అలాగే గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు రూపొందించే అభివృద్ధి ప్రణాళికలను ఈ-గ్రామ స్వరాజ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
16వ ఆర్థిక సంఘం ద్వారా లభిస్తున్న ఈ భారీ గ్రాంట్‌తో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కొత్త ఊపు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. గ్రామీణ జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ఈ నిధులు కీలక పాత్ర పోషించనున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
