వైద్య సేవల డిమాండ్–లభ్యత మధ్య ఉన్న గ్యాప్‌ను పూరించేందుకు పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానాన్ని మరింత విస్తృతంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మరోసారి స్పష్టమైన సూచనలు చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ విజయ్ నెహ్రా ఈ నెల 12న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి శ్రీ సౌరభ్ గౌర్‌కు వివరణాత్మక లేఖ రాశారు. లేఖకు అనుబంధంగా 27 పేజీల మార్గదర్శకాలను పంపిస్తూ, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను వేగంగా అందించేందుకు పీపీపీ మోడల్ ఎంతగానో ఉపయోగపడుతుందని కేంద్రం పేర్కొంది.
ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ జె.పి. నడ్డా రాసిన లేఖను ప్రస్తావించిన కేంద్ర అధికారులు, వైద్య విద్యతో పాటు కీలక వైద్య సేవల విస్తరణకు పీపీపీ అత్యంత అనుకూల సాధనమని తెలిపారు. ఈ నేపథ్యంలోనే రెండో లేఖ ద్వారా రాష్ట్రం వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అంశాలను స్పష్టంగా సూచించారు. ముఖ్యంగా న్యూక్లియర్ మెడిసిన్, మొబైల్ మెడికల్ యూనిట్లు, దంత వైద్య సేవలు, రేడియాలజీ సేవలు, క్యాన్సర్ డే కేర్ సెంటర్ల విస్తరణపై దృష్టి పెట్టాలని కేంద్రం కోరింది.
ఎక్విప్–ఆపరేట్–మెయింటైన్ (EOM), ఆపరేట్ అండ్ మెయింటైన్ (O&M) మోడళ్ల ద్వారా ప్రైవేట్ భాగస్వామ్యంతో సేవల లభ్యతను పెంచాలని, 5 నుంచి 10 సంవత్సరాల కాలానికి అనుగుణంగా చెల్లింపు విధానాలపై కూడా మార్గదర్శకాలు రూపొందించినట్లు కేంద్రం తెలిపింది. న్యూక్లియర్ మెడిసిన్ ద్వారా క్యాన్సర్, గుండె సంబంధిత, నరాల వ్యాధులకు మెరుగైన సేవలు అందించవచ్చని, అయితే మధ్యతరహా, చిన్న పట్టణాల్లో ఈ సేవలు తీవ్రంగా కొరతగా ఉన్నాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. క్యాన్సర్ వ్యాప్తి వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, పెట్–సీటీ, స్పెక్ట్ ఇమేజింగ్, రేడియోథెరపీ సేవలను గ్రామీణ, సెమీఅర్బన్ ప్రాంతాలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.
దంత ఆరోగ్యంపై కూడా కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. 60 నుంచి 90 శాతం వరకు ప్రజలు దంత సమస్యలతో బాధపడుతున్నప్పటికీ, అవసరమైన సేవలు అందుబాటులో లేవని పేర్కొంది. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో దంత వైద్య పరికరాలు, వైద్యుల కొరత ఉందని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పీపీపీ ద్వారా దంత సేవలను బలోపేతం చేయాలని సూచించింది. అలాగే ఎక్స్‌రే, సీటీ, ఎంఆర్ఐ వంటి వ్యాధి నిర్ధారణ పరికరాల లభ్యతను విస్తరించేందుకు పీపీపీ విధానం ఉపయోగపడుతుందని తెలిపింది.
క్యాన్సర్‌పై పోరాటంలో ముందస్తు స్క్రీనింగ్, నిర్ధారణ కోసం డే కేర్ సెంటర్లు కీలకమని కేంద్రం పేర్కొంది. 2027–28 నాటికి దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయడమే లక్ష్యమని వెల్లడించింది. ఈ దిశగా 2025–26 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌కు 14 సెంటర్లు మంజూరు చేసినట్లు లేఖలో పేర్కొంది. ఈ లేఖ వివరాలను కార్యదర్శి శ్రీ సౌరభ్ గౌర్ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
