దేశవ్యాప్తంగా ఎన్నికల జోరు కొనసాగుతోంది. తొలి విడతలోనే ఏపీ అసెంబ్లీతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికలు ముగిశాయి. అనంతరం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే అంశంపై ఎవరికి వారు విశ్లేషణలు చేస్తూనే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసి 12 రోజులు కావస్తున్నా, ఏ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయనే అంశంపై లెక్కలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే పలు సంస్థల ఎగ్జిట్ పోల్ సర్వేలివే అంటూ సోషల్ మీడియాలో కొన్ని అంకెలు చక్కర్లు కొడుతున్నాయి.
చివరి విడత ఎన్నికలు ముగిసే వరకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రకటించకూడదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంచేయడంతో ఏ సంస్థా అధికారికంగా ఫలితాలు విడుదల చేయలేదు. అయితే, ఫలితాలు ఇవేనంటూ లీకులు వస్తున్నాయి. ఏపీలో వైఎస్సార్ సీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ విజయం సాధించబోతున్నాయంటూ ఎక్కువ సంస్థలు అంచనా వేశాయి. తాజాగా కేంద్ర ఇంటెలిజెన్స్ సర్వేలో వెల్లడైన ఫలితాలు ఇవేనంటూ కొన్ని లెక్కలు దర్శనమిస్తున్నాయి. ఏపీ, తెలంగాణల్లో పోలింగ్ సందర్భంగా కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం ఎగ్జిట్ పోల్ సర్వే నిర్వహించింది.
ఏపీలో ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ అధికారం కేవసం చేసుకుంటుందని, తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ అత్యధిక ఎంపీ స్థానాలను గెలుచుకుంటుందని ఆ సర్వేలో తెలింది. వైఎస్సార్ సీపీకి 95 నుంచి 105 అసెంబ్లీ సీట్లు వస్తాయని అంచనా వేసింది. అయితే, ఎంపీ సీట్లు మాత్రం ఆ పార్టీకి 16 నుంచి 19 మాత్రమే వస్తాయని పేర్కొంది. కీలకమైన 9 స్థానాల్లో వైఎస్సార్ సీపీ ఓటమి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, నరసాపురం, మచిలీపట్నం, విజయవాడ, నరసరావుపేట, కర్నూలు సీట్లలో వైఎస్సార్ సీపీ గెలిచే అవకాశాలు అంతగా లేవని సర్వేలో తేలినట్టు సమాచారం.
ఇప్పటివరకు వచ్చిన సర్వేల్లో వైఎస్సార్ సీపీకి 100 నుంచి 130 స్థానాల వరకు వస్తాయని వెల్లడైంది. అలాగే 20 వరకు ఎంపీ స్థానాలు గెలుచుకుంటుందని తెలిపాయి. అయితే, కేంద్ర ఇంటెలిజెన్స్ సర్వేలో మాత్రం ఎంపీ సీట్లు తగ్గడం గమనార్హం. అధికార తెలుగుదేశం పార్టీ చాలా స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చిందని, ఆ పార్టీకి 65 నుంచి 70 అసెంబ్లీ సీట్లు, 6 నుంచి 9 ఎంపీ సీట్లు వస్తాయని కేంద్ర నిఘా విభాగం సర్వేలో తేలింది.
ఇక జనసేన ప్రభావం ఎంపీ సీట్లపై ఉండదని, అసెంబ్లీ సీట్ల విషయానికి వచ్చేసరికి ఆ పార్టీ గరిష్టంగా మూడింటిలో విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొంది. ఇక తెలంగాణలో అధికార టీఆర్ఎస్ విజయదుందుభి మోగించడం ఖాయమని తాజా సర్వేలోనూ తేలింది. గులాబీ పార్టీకి 14 నుంచి 16 సీట్లు వస్తాయని ఈ ఎగ్జిట్ పోల్ లో వెల్లడైనట్టు సమాచారం. ఇక్కడ ఎంఐఎం ఒకటి, బీజేపీ ఒకటి లేదా రెండు స్థానాలు గెలుచుకోవచ్చని పేర్కొంది. మొత్తమ్మీద ఓటరు తీర్పు ఎలా ఉండబోతుందనేది ఈ సర్వేలు వెల్లడిస్తున్నా.. అసలు ఫలితాలు వచ్చేవరకు కచ్చితంగా ఏదీ చెప్పలేం. మే 19న సాయంత్రం ఎగ్జిట్ పోల్ ఫలితాలు, మే 23న అసలు ఫలితాలు వెల్లడి కానున్నాయి. అప్పటివరకు వేచి చూడక తప్పదు.
