విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు. ఈ నినాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయొద్దంటూ కార్మికుల నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయి. దీనిపై ఒక్కో రాజకీయ పార్టీ ఒక్కో విధంగా స్పందిస్తోంది. ఇక ఏపీలో ఎలాగూ ఎన్డీయే ప్రభుత్వం వచ్చింది కాబట్టి కచ్చితంగా విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం కాకుండా చూస్తారనే నమ్మకం అటు కార్మికుల్లో పెరిగింది. ఈ క్రమంలోనే అటు కేంద్ర ప్రభుత్వం మీద చంద్రబాబు ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందనే ప్రచారం కూడా జరుగుతోంది. బీజేపీ కోరుకున్నట్టే ఏపీ ప్రభుత్వంలో కూడా ఉంది.
పైగా ఇప్పుడు టీడీపీ మద్దతుతోనే మోడీ కేంద్రంలో ప్రధాని అయ్యారు. కాబట్టి చంద్రబాబు డిమాండ్ లకు తలొగ్గాల్సిన పరిస్థితి వస్తోంది. ఈ క్రమంలోనే కేంద్రం కూడా విశాఖ ఉక్కు విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కార్మికులు కోరుకుంటున్నట్టు విశాఖ ఉక్కు పరిశ్రమను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో విలీనం చేసే ప్రతిపాదనను కూడా సీరియస్ గా తీసుకుందని అంటున్నారు. అలాగే విశాఖ ఉక్కుకు చెందిన 1500 ఎకరాల నుంచి రెండు వేల ఎకరాల వరకు భూమిని ఎన్ఎండీసీకి అమ్మేయాలని చూస్తోంది.
అలా చేయడం ద్వారా.. అలాగే బ్యాంకు రుణాలను కూడా తీసుకుని ఎంతో కొంత ఆర్థికంగా దోహదం అయ్యేలా చూడాలని ప్లాన్ చేస్తోందంట. ఉక్కు పరిశ్రమను సెయిల్ కు అప్పగించాలన్న ఆలోచన ఉందని కూడా చెబుతున్నారు. ఇలా చేస్తే చాలా వరకు అప్పులు తీరుతాయని.. తద్వారా ఉక్కు పరిశ్రమ కార్మికులు గట్టెక్కుతారని అనుకుంటోంది కేంద్రం.