ఐదేళ్ళుగా వైసీపీ ప్రభుత్వ నిరాదరణకు గురైన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి, కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలో వైసీపీ పాలన అంతమై టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి అధికార పీఠమెక్కిన సంగతి తెలిసిందే.
కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో వున్న ఎన్డీయే ప్రభుత్వం, ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతికి తాజాగా కేంద్ర బడ్జెట్‌లో 15 వేల రూపాయలు కేటాయించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర బడ్జెట్ ప్రసంగం సందర్భంగా లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు.
ప్రస్తుత బడ్జెట్‌లో 15 వేల కోట్ల రూపాయల్ని ఆంధ్ర ప్రదేశ్ రాజధాని కోసం కేటాయించనున్నామనీ, భవిష్యత్తులో అవసరమైన మేరకు అదనపు నిధుల్ని కూడా కేటాయిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం గమనార్హం.
గతంలో.. అంటే, 2014-2019 మధ్యకాలంలోనూ ఎన్డీయే కూటమి అధికారంలో వున్నా (అప్పట్లో టీడీపీ – బీజేపీ కూటమి) రాజధాని అమరావతికి ఈ స్థాయిలో కేంద్రం నుంచి కేటాయింపులు జరగలేదు. ఈసారి కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ కూడా భాగమైన దరిమిలా, కేంద్రం నుంచి ఈ స్థాయి కేటాయింపులు జరగడం విశేషమే మరి.
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి గురించి లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించడమే కాదు, ఆమె పోలవరం ప్రాజెక్టు గురించి కూడా ప్రస్తావించారు. సాధ్యమైనంత వేగంగా పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తామన్నారు.
రాష్ట్రానికి జీవనాడి అనీ, భారతదేశ ధాన్యాగారానికి పోలవరం ప్రాజెక్టు ఊతమిస్తుందని నిర్మలా సీతారామన్ పేర్కొనడం గమనార్హం. ఏది ఏమైనా, ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయి పదేళ్ళయ్యాక కేంద్రంలోని బీజేపీ, విభజన చట్టాన్ని కాస్త గట్టిగానే గుర్తుకు తెచ్చుకున్నట్లుగా కనిపిస్తోంది.
మాటలకు, రాతలకే పరిమితం కాకుండా, నిధుల కేటాయింపు ‘చేతల్లో’ కూడా సజావుగా సాగాలని ఆశిద్దాం.
