కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్రం ఆర్థిక సాయం చేస్తుందని ప్రకటించారు. ఈ సాయాన్ని కేంద్ర బడ్జెట్‌లోనే ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ఆ తర్వాత మీడియా ముందర కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు.
లోక్ సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంలో అమరావతి పేరు ప్రస్తావించకుండా, ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అని మాత్రమే పేర్కొన్నారు. అయితే, మీడియా సమావేశంలో స్పష్టత ఇచ్చారామె.
దేశంలో రాజధాని అంటూ లేని రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ మాత్రమేననీ, పదేళ్ళుగా ఈ పరిస్థితి నెలకొనడం బాధాకరమనీ, ఎవరి వల్ల.? అన్న విషయంపై తాను కామెంట్ చేయదలచుకోలేదనీ చెబుతూ.. రాజధాని అమరావతి కోసం పదిహేను వేల కోట్ల రూపాయల్ని కేంద్రం సాయంగా అందిస్తుందని నిర్మలా సీతారామన్ చెప్పారు.
అసలంటూ నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో పేర్కొన్నది పదిహేను వేల కోట్ల రూపాయల అప్పు అని మాత్రమేనంటూ వైసీపీ, సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేయడం ప్రారంభించింది.
అయితే, విభజన చట్టం ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ రాజధానికి సాయం అందించాల్సిన బాధ్యత కేంద్రం మీద వుందనీ, రాష్ట్రానికి ప్రకటించిన పదిహేను వేల కోట్ల రూపాయల సాయం తాలూకు బాధ్యత కేంద్రమే తీసుకుంటుందని నిర్మలా సీతారామన్ ప్రకటించడం గమనార్హం.
పదిహేను వేల కోట్ల సాయం, ఆపై అవసరమైతే అదనపు సాయం.. అంటూ నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రకటించిన సంగతి తెలిసిందే. గడచిన ఐదేళ్ళుగా అమరావతి నిర్లక్ష్యానికి గురయ్యింది. పదిహేను వేల కోట్ల రూపాయల సాయం.. అనేది అమరావతికి ఊపిరి పోసినట్లే అవుతుందిప్పుడు.
వీలైనంత వేగంగా, అమరావతి నిర్మాణ పనుల్ని పునఃప్రారంభించడం టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ముందున్న తక్షన కర్తవ్యం.