కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొద్దిరోజులుగా దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన జమిలి ఎన్నికలకు బీజేపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ” ఒకే దేశం ఒక ఎన్నిక” విధానంపై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికకు కేంద్ర కాబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రస్తుత ప్రభుత్వంలోనే జమిలి ఎన్నికలు జరిపించి తీరుతామని మంగళవారం కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారం చేపట్టి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ పనితీరును వెల్లడించేందుకు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో జమిలి ఎన్నికలపై వ్యాఖ్యల చేసి 24 గంటలు గడవకముందే జమిలి ఎన్నికలకు ప్రభుత్వం ఓకే చెప్పడం గమనార్హం. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టమన్నారు. ఇది గనక చట్ట రూపం దాలిస్తే లోక్ సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి జరిపించి.. స్థానిక ఎన్నికలను 100 రోజుల్లోపు నిర్వహించాల్సి ఉంటుంది.
గతంలోనూ ప్రధాని నరేంద్ర మోడీ జమిలి ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. విడతల వారీగా ఎన్నికలు జరగడం వల్ల పురోగతికి అడ్డంకులు పెరుగుతున్నాయని, ఆర్థికంగా భారమవుతోందని వ్యాఖ్యానించారు. ఎన్నికల వల్ల ఆర్థిక భారం తగ్గుతుందని, సంక్షేమ పథకాల అమలుకు ఎటువంటి ఇబ్బంది ఉండదని ఆయన పేర్కొన్నారు.