ప్రభుత్వాలు మారితే, రాజధాని మారిపోతుందా.? ఈ చర్చకు ఇకపై ఆస్కారం వుండకూడదు.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఖచ్చితంగా వుండి తీరాలి. గతంలో రాష్ట్ర అసెంబ్లీ నిర్ణయించిన, రాజధాని అమరావతి.. భవిష్యత్తులోనూ రాజధానిగానే కొనసాగాలి. రాష్ట్ర అభివృద్ధి అనే నావకి, అమరావతి దిక్సూచిగా మారాలి.
రాజధాని అమరావతి పేరుతో గతంలో చంద్రబాబు సర్కారు పబ్లిసిటీ స్టంట్లు చేసిన మాట వాస్తవం. అమరావతి కోసం నిధుల సమీకరణలో భాగంగా, ప్రజల్ని భాగస్వాముల్ని చేస్తూ, విరాళాల్ని సేకరించడం వంటి వ్యవహారాలు అప్పట్లో నవ్వులపాలయ్యాయి.
ఇక, రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులు, గడచిన ఐదేళ్ళలో చూసిన ‘నరకం’ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతున్న దరిమిలా, గతంలో జరిగిన పొరపాట్లకు తావివ్వకూడదు. గడచిన ఐదేళ్ళ వైసీపీ పాలనలో, అమరావతి అన్ని విధాలా అణచివేతకు గురయ్యింది.
ఇప్పుడిక, అమరావతి కోసం భూములిచ్చిన రైతుల ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత టీడీపీ అధినేత చంద్రబాబు మీదనే వుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం, రాజధాని అమరావతికి సంబంధించి సమీప భవిష్యత్తులో ఎలాంటి వివాదాలూ లేకుండా, కేంద్రంతో మాట్లాడి, రాజధానికి తగిన గుర్తింపుని తీసుకురావాల్సి వుంటుంది.
అదే సమయంలో, రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు సంబంధించి గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేవనెత్తిన అంశాల్ని, చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో పరిగణనలోకి తీసుకోవాల్సి వుంటుంది. అటు రాజధాని కోసం భూములిచ్చిన రైతులు, ఇటు రాజధాని.. ఈ రెండిటినీ బ్యాలెన్స్ చేయాల్సిందే.
ఆల్రెడీ రాజధాని అమరావతిలో, సుందరీకరణ పనులు మొదలయ్యాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవీ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు ఇవి. శాశ్వత భవనాల నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయడం సహా, చాలా పనులున్నాయ్ అమరావతిలో. ‘తాత్కాలిక’ అన్న పేరు భవిష్యత్తులో ప్రస్తావించకుండా, అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాల్సి వుందిప్పుడు.