ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం ఖరారు అయింది. ఈనెల 12 వ తేదీ ఉదయం 11.27 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటి పార్క్ వద్ద ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ తో సహా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల ముఖ్య నేతలు రానున్నందున తొలుత ఎయిమ్స్ సమీపంలో ఓ స్థలాన్ని పరిశీలించారు. ఆ స్థలం అనుకూలంగా లేకపోవడంతో గన్నవరం సమీపంలోని స్థలంలో ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టీజి జనార్ధన్ తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు.
చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు మంత్రులు కూడా అదే రోజున ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరికి ఏ మంత్రిత్వ శాఖ కేటాయించాలన్న విషయంపై రెండు రోజుల్లో స్పష్టత రానుంది. కూటమిలోని ఎమ్మెల్యేలకు కూడా మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉండటంతో మంత్రివర్గ కూర్పు పై కసరత్తు జరుగుతోంది.