హీరోలు విక్టరీ వెంకటేశ్, రానాల మీద కేసు నమోదైంది. నాంపల్లి కోర్టు సంచలన ఆదేశాలతో పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. అసలు విషయం ఏంటంటే.. ఫిల్మ్ నగర్ లో వెంకటేశ్ కు ఉన్న వెయ్యి గజాల స్థలాన్ని ఆరేళ్ల క్రితం నందకుమార్ అనే వ్యక్తి లీజుకు తీసుకున్నాడు. అందులో డెక్కన్ కిచెన్ పేరుతో రెస్టారెంట్ ను ఏర్పాటు చేశాడు. అయితే ఇదే వెంకటేశ్ స్థలానికి పక్కనే ఉన్న రానా స్థలాన్ని కూడా లీజుకు తీసుకున్నాడు. ఆ స్థలంలో కొన్ని నిర్మాణాలు చేపట్టాడు. లీజు సమయం పూర్తి అయినా సరే నిర్మాణాలు ఇంకా జరుపుతున్నారంటూ రానా జీహెచ్ ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. తన రెస్టారెంట్ ను కూల్చొద్దంటూ నందకుమార్ హైకోర్టుకు వెళ్లారు.
అదే సమయంలో ఈ రెస్టారెంట్ ను కూల్చేశారు. తన రెస్టారెంట్ ను కూల్చేయడంతో రూ.20 కోట్ల నష్టం వచ్చిందని దగ్గుబాటి ఫ్యామిలీపై చర్యలు తీసుకోవాలంటూ నందకుమార్ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో నాంపల్లి కోర్టు వెంకటేశ్, రానా, సురేశ్ బాబు, అభిరామ్ ల మీద కేసులు నమోదు చేయాలంటూ పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో ఫిలింనగర్ పోలీసులు దగ్గుబాటి ఫ్యామిలీ మీద కేసులు నమోదు చేశారు. 448, 452, 458, 120బీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే తమ స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేశారంటూ దగ్గుబాటి ఫ్యామిలీ చెబుతోంది.
ఇదే వ్యవహారంపై అటు నందకుమార్ మీద కూడా కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ కేసు విషయంలో దగ్గుబాటి ఫ్యామిలీ స్పందించలేదు. వెంకటేశ్ ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.