మాట తప్పం.. మడమ తిప్పం.. అనే హక్కు ఇకపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎవరికీ వుండదు. ఎందుకంటే, చట్ట సభల సాక్షిగానే మాట తప్పేశారు.. మడమ తిప్పేశారు. ఇకపై బేషజాలు అనవసరం. రాజధాని అమరావతి విషయంలో అయితే, అస్సలేమాత్రం బేషజాల్లేకుండా ముందడుగు వేయొచ్చు. కానీ, వైఎస్ జగన్ సర్కార్ అంతటి చిత్తశుద్ధి, అంతటి బాధ్యత చూపిస్తుందని ఆశించగలమా.? అన్నదే అసలు సిసలు ప్రశ్న.
‘మా పార్టీ విధానం వేరు. కానీ, మీరు పడుతున్న వెతలు నేను అర్థం చేసుకోగలను. మీ ఆలోచన, మీ కోరిక, మీ డిమాండ్.. ఇవన్నీ నాకు తెలుసు. ఓ ఎమ్మెల్యేగా, నా నియోజకవర్గ పరిధిలో మీ పర్యటన సందర్భంగా ఇబ్బందులు ఏమైనా తలెత్తితే నేరుగా నేనే వచ్చి మీకు సాయం చేస్తాను..’ అని వైసీపీ ఎమ్మెల్యే, అమరావతి రైతులకు హామీ ఇవ్వడం చిన్న విషయమేమీ కాదు.
పార్టీ లైన్ దాటలేదు వైసీపీ ఎమ్మెల్యే. కానీ, మానవత్వం చాటుకున్నారు. అసలు ఈ మానవత్వం వుండాల్సింది ప్రభుత్వ పెద్దలకి. రైతులు, ప్రభుత్వానికి భూమి ఇచ్చారు. అప్పట్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నారు, ఇప్పుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా వున్నారు.
ఈ రోజుల్లో ప్రభుత్వాలు ఎన్ని కల్లబొల్లి కబుర్లు చెప్పినా, వందల ఎకరాల భూముల్ని రైతులు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఇచ్చే పరిస్థితి వుండదు. చంద్రబాబు మాయే చేశారో.. ఇంకేమన్నా చేశారో, రైతులైతే ప్రభుత్వానికి భూములిచ్చారు. అధికారిక ఒప్పందాల ప్రకారం రైతులకు న్యాయం జరగాలి.
న్యాయస్థానం కూడా ఈ రోజు, కార్యాలయాల తరలింపు మినహా.. రాజధాని అమరావతికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల్లో ఎలాంటి న్యాయపరమైన సమస్యలూ తమవైపు నుంచి వుండబోవని స్పష్టం చేసేసింది. సో, శాసన రాజధానిగానే అయినా, అమరావతి అభివృద్ధి పనుల్ని ఆ పేరుతో కాకుండా వైఎస్ జగన్ సర్కార్ పునఃప్రారంభించాల్సి వుంటుంది. అలా చేస్తే, ఈ ‘యూ టర్న్’ మంచిదేనని రాష్ట్ర ప్రజలు భావిస్తారు. లేదంటే, అంతే సంగతులు.