సోషల్ మీడియాతో పాటు పలు డబ్బింగ్ చిత్రాలతో పాపులర్ అయిన అనిక సురేంద్రన్ నటించిన తెలుగు చిత్రం బుట్ట బొమ్మ. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం మలయాళం సూపర్ హిట్ కప్పేలకు రీమేక్ గా తెరకెక్కింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దామా.
కథ:
ఒక యువతి అనుకోకుండా ఆటో డ్రైవర్ కు కాల్ చేస్తుంది. ఆపై అతనితోనే ప్రేమలో పడుతుంది. వీళ్ళు ప్రేమించుకుంటూ సంతోషంగా ఉండగా ఒక వ్యక్తి తమను అనుసరిస్తున్నాడని, ప్రతీ చోటికి ఫాలో అవుతున్నాడని తెలుసుకుంటారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎందుకు వీళ్ళని ఫాలో అవుతున్నట్లు? చివరికి వీళ్ళ ప్రేమకథ ఏమైంది?
నటీనటులు:
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పటి నుండే చాలా సినిమాలు చేసేసిన అనిక సురేంద్రన్, ఇది తన మొదటి తెలుగు చిత్రం అనేలా ఎక్కడా కనిపించలేదు. చాలా సీనియర్ నటిలా సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసేసింది అనిక. సత్యగా ఆమె నటన నిజంగా సూపర్బ్ అనొచ్చు.
ఈ చిత్రంతోనే డెబ్యూ చేసాడు సూర్య వశిష్ఠ. అతను కూడా ఎక్కడా ఇది తన తొలి చిత్రం అనేలా లేడు. చాలా మెచ్యూర్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. అర్జున్ దాస్ కు దక్కింది చిన్న పాత్ర అయినా కూడా పూర్తి న్యాయం చేసాడు. మిగతా నటీనటులు తమ తమ పాత్రల్లో బాగానే చేసారు.
సాంకేతిక నిపుణులు:
దర్శకుడు రీమేక్ ను యధాతథంగా దించడంలో సక్సెస్ అయ్యాడు. ఒరిజినల్ ఫ్లేవర్ ను మిస్ చేయకుండా ఉంచడంలో సక్సెస్ సాధించాడు. అయితే ఈ సినిమాకు ఉన్న ప్రధానమైన డ్రాబ్యాక్ అంటే సినిమా చాలా స్లో గా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ బాగా సాగదీసినట్లు కనిపిస్తుంది. చిత్రం ఇచ్చిన మెసేజ్ కు చాలా మంచి ఇంపాక్ట్ ఉండి ఉండేది, ఈ సాగదీసిన ఫీలింగ్ లేకుండా జాగ్రత్తపడి ఉంటే.
గోపి సుందర్ అందించిన సంగీతం సినిమాకు మెయిన్ ప్లస్ అయింది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ చాలా బాగున్నాయి. ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ఉండొచ్చు.
ప్లస్ పాయింట్స్:
- చిత్రం ఇచ్చే మెసేజ్
- హీరో, హీరోయిన్ల పెర్ఫార్మన్స్
మైనస్ పాయింట్స్;
- ఫస్ట్ హాఫ్
- వీక్ స్క్రీన్ ప్లే
- నత్తనడకన సాగే నరేషన్
విశ్లేషణ:
ఒరిజినల్ ను నిజాయితీగా రీమేక్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అయితే చిత్రం మరీ నెమ్మదిగా సాగి ఇబ్బంది పెడుతుంది. పైగా ఒరిజినల్ చూసిన వారికి కొత్తగా ఇందులో చూడాల్సింది ఏం లేదు.