Bunny Vas: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ (Bunny Vas) తన రాజకీయ ప్రయాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయ్ సినిమా కార్యక్రమంలో ఆయనకు ఎదురైన ప్రశ్నపై స్పందించారు. గత ఎన్నికల్లో పాలకొల్లు ఎమ్మెల్యే టికెట్ పవన్ కల్యాణ్ ను అడిగారా అనే ప్రశ్నకు.. ‘నిజానికి నేను 2019 ఎన్నికల్లోనే పోటీ చేయాల్సింది. అప్పట్లోనే నన్ను పోటీ చేయమన్నారు పవన్ కల్యాణ్. అయితే.. అప్పుడే వద్దు సర్. నాకు కొంచెం టైమ్ కావాలి అన్నాను’.
‘అలా ఆలోచించకు. ఓడినా పర్లేదు.. భయపడకు. వేయాలనుకుంటే ముందడుగు వేసేయ్ అని ధైర్యం చెప్పారు. కానీ.. అప్పట్లో నేను ధైర్యం చేయలేకపోయా. 2024 ఎన్నికల సమయంలో కలిసినప్పుడు మళ్లీ అడిగారు. టైమ్ తీసుకుంటావా అని. నేను.. అల్లు అరవింద్ గారితో మాట్లాడి చెప్తా అన్నాను. నా ఇబ్బంది గమనించి.. నువ్వెప్పుడైతే నీకు నువ్వుగా నిర్ణయం తీసుకుంటావో అప్పుడొచ్చి నన్ను కలువ’మన్నారని చెప్పారు.
బన్నీ వాస్ నాడు ప్రజారాజ్యం, నేడు జనసేన పార్టీలో క్రియాశీలకంగా పని చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన రాజకీయ అరంగేట్రంపై వార్తలు వచ్చాయి. దీనిపైనే ఆయన స్పందించారు.