Buggana: మద్యపానం బాధ్యతా రాహిత్యం.! ఔను, ఇందులో ఇంకో మాటకు తావు లేదు. మద్యపానమే కాదు, ధూమపానం కూడా.! ఎందుకంటే, మద్యపానం వల్ల అనారోగ్య సమస్యలొస్తాయ్. ధూమపానం కూడా అంతే. ఆర్థికంగా కుటుంబాలు చితికిపోతున్నాయ్ మద్యపానం, ధూమపానం వల్ల.! కానీ, ఏం చేస్తాం.? అవి దురలవాట్లు.! మానుకోలేని వ్యసనాలు.! పైగా, అవి ప్రభుత్వాలకు వందల కోట్లు, వేల కోట్ల రూపాయల్ని అందిస్తాయ్.. పన్నుల రూపంలో. అందుకే, ధూమపానాన్ని పూర్తిగా నిషేధించే పరిస్థితి లేదు. మద్యపానం విషయంలోనూ అంతే.!
2019 ఎన్నికల ప్రచారంలో, ‘మేం అధికారంలోకి వస్తే పూర్తిగా మద్యాన్ని నిషేధించేస్తాం..’ అన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ‘తొలుత దశల వారీ మద్య నిషేధం.. చివరికి పూర్తి నిషేధం.. మద్యాన్ని పూర్తిగా నిషేధించాకే మళ్ళీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతాం..’ అని కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెలవిచ్చారు. ఇప్పుడేమో, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ‘బాధ్యతాయుత మద్యపానం’ అంటూ కొత్త ప్రస్తావనను తెరపైకి తెచ్చారు. నవ్విపోదురుగాక వాళ్ళకేటి.? అన్నట్టుంది పరిస్థితి. మద్యపానమంటేనే బాధ్యతారాహిత్యం.! అలాంటిది, బాధ్యతాయుత మద్యపానమేంటి.?
తాము ఏం చేసినా, ఏం చెప్పినా.. జనాలు గొర్రెల్లా వింటారన్న భావన అధికార వైసీపీలో మెండుగా వుందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? ‘మద్యాన్ని నిషేధిస్తామన్నారు కదా.?’ అని అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, అధికార పక్షం వైసీపీని నిలదీస్తే, ముఖ్యమంత్రి కొన్నాళ్ళ క్రితం చెప్పిన సమాధానమేంటో తెలుసా.? ‘ప్రభుత్వానికి డబ్బులు రాకూడదని విపక్షాలు కుట్ర పన్నుతున్నాయి అధ్యక్షా..’ అని. మరి, మద్య నిషేధం.. అన్న మాట ప్రస్తావించినప్పుడు, ‘ప్రభుత్వానికి వచ్చే ఆదాయం’ గురించిన ఆలోచన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేదా.? వుండదు, ఎందుకంటే అప్పుడాయన ప్రతిపక్ష నేత. ఇప్పుడు.. ముఖ్యమంత్రి.!