ఒకప్పుడు తెలంగాణ సెంటిమెంట్‌ని క్యాష్ చేసుకోవడంలో కేసీయార్ పార్టీ తర్వాతే ఎవరైనా. తెలంగాణ అంటే కేసీయార్, కేసీయార్ అంటే తెలంగాణ.! ఎప్పుడైతే కేసీయార్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా భారత్ రాష్ట్ర సమితిగా మారిందో.. అప్పటినుంచి లెక్కలు మారిపోయాయ్.
కేసీయార్ పార్టీకి కాస్త దూరం జరిగిన ఓ ఎమ్మెల్యేకీ, అదే పార్టీకి చెందిన ఇంకో ఎమ్మెల్యేకీ మధ్య ఆధిపత్య పోరుని, తెలుగు ప్రజల మధ్య పోరుగా మార్చే ప్రయత్నం చేసి బొక్క బోర్లా పడింది గులాబీ పార్టీ.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి మధ్య వ్యక్తిగత, రాజకీయ ఆధిపత్య పోరు అందరికీ తెలిసిందే. కేసీయార్ మెప్పు కోసం అరికెపూడి గాంధీ మీద ‘ఆంధ్ర ఆరోపణలు’ చేయడం మొదలెట్టారు కౌశిక్ రెడ్డి. బీఆర్ఎస్‌కి దూరం జరిగే ఆలోచనలో వున్న అరికెపూడి గాంధీ, ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు.
జంటనగరాల్లో వినాయక చవితి – నిమజ్జనం హంగామా ఓ వైపు నడుస్తోంటే, ఇంకో వైపు కౌశిక్ రెడ్డి – అరికెపూడి గాంధీ వ్యవహారం.. పొలిటికల్ హీట్‌ని పెంచింది. మామూలుగా అయితే, తెలంగాణ సెంటిమెంట్‌ని ఇంకాస్త మండించి, పొలిటికల్ మైలేజ్ సాధించేందుకు గులాబీ పార్టీ ప్రయత్నించేదే.
‘అబ్బే, అరికెపూడి గాంధీ మీద విమర్శలు తప్ప, ఆంధ్రా మీద విమర్శలు కావు’ అంటూ నేరుగా బీఆర్ఎస్ నేతలే బుకాయించాల్సి వచ్చింది. రాజకీయాలు మారాయ్. లోక్ సభ ఎన్నికల్లో జీరోగా తేలిన బీఆర్ఎస్, ‘సెటిలర్స్’ పేరుతో విభజన రాజకీయాలు చేసే పరిస్థితుల్లో లేదు.
కాకపోతే, బీఆర్ఎస్ పార్టీలో కొందరు, ఇంకా ఆ విభజన వాదంతో, పార్టీకి ఏదో మనుగడ సాధ్యమవుతుందనే భ్రమల్లో.. వెకిలి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ లిస్టులో కౌశిక్ రెడ్డి కూడా ఒకరు.