పోలీసింగ్ అంటే కేవలం యూనిఫాం ధరించడం కాదు.. ప్రజల జీవితాల్లో ఉన్న అసలైన సమస్యలను అర్థం చేసుకుని వాటికి పరిష్కారం చూపించే బాధ్యత కూడా. ఆ బాధ్యతను తన ధైర్యంతో, నిబద్ధతతో మరోసారి గుర్తు చేశారు తెలంగాణకు చెందిన ఐపీఎస్ అధికారి సుమతి. రాత్రి వేళ సాధారణ మహిళలా ఒంటరిగా వీధుల్లో తిరుగుతూ ఆమె నిర్వహించిన అండర్‌కవర్ ఆపరేషన్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ప్రచారం కోసం కాదు.. మహిళలు ప్రతిరోజూ ఎదుర్కొనే భయాన్ని స్వయంగా అనుభవించి సమాజానికి చూపించాలనే ఉద్దేశంతో సుమతి ఐపీఎస్ ఈ ఆపరేషన్ చేపట్టినట్లు తెలుస్తోంది. కేవలం మూడు గంటల్లోనే దాదాపు 40 మంది పురుషులు ఆమెను సంప్రదించడానికి ప్రయత్నించడం పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో స్పష్టంగా చూపించింది.
సాధారణంగా మహిళలు రాత్రి వేళ బయటకు వెళ్లేటప్పుడు ఎదుర్కొనే అసౌకర్యాలు, భద్రతా సమస్యలు, వేధింపులు ఎంత తీవ్రమైనవో ఈ ఘటన మరోసారి బయటపెట్టింది. రోడ్డుపై నడవడం, వాహనం కోసం వేచి ఉండడం లేదా ఒంటరిగా ప్రయాణించడం కూడా కొంతమంది మహిళలకు భయంతో కూడిన అనుభవంగా మారిందన్న వాస్తవాన్ని ఈ ఆపరేషన్ సమాజం ముందుంచింది.
సుమతి ఐపీఎస్ చూపించిన విధానం ఇప్పుడు “ఐడియల్ పోలీసింగ్”గా ప్రశంసలు అందుకుంటోంది. కార్యాలయాల్లో కూర్చొని ఫిర్యాదులు స్వీకరించడం మాత్రమే కాకుండా, ప్రజల మధ్యకి వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం కూడా నిజమైన పోలీసింగ్ అని ఆమె నిరూపించారు. మహిళల భద్రత విషయంలో తెలంగాణ పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలకు ఈ ఆపరేషన్ మరో బలమైన ఉదాహరణగా నిలిచింది.
సమాజం ఎలా స్పందిస్తోంది.. మహిళలు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు అనే విషయాలను స్వయంగా తెలుసుకునే ప్రయత్నం చేసిన సుమతి ఐపీఎస్‌పై ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. మహిళల కోసం పనిచేసే పోలీస్ వ్యవస్థ తమ వెంట ఉందనే నమ్మకాన్ని ఆమె మరింత బలపరిచారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మహిళల భద్రత అనేది ప్రత్యేక సౌకర్యం కాదు.. అది ప్రతి మహిళకు ఉండాల్సిన ప్రాథమిక హక్కు. ఆ హక్కు కోసం ధైర్యంగా ముందుకు వచ్చిన సుమతి ఐపీఎస్ వంటి అధికారులు సమాజానికి అవసరమని ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.
