కాంగ్రెస్ పార్టీలో వున్నప్పుడు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నానా తిట్లూ తిట్టిన ఘనుడాయన. విజయవాడే 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అవ్వాలని డిమాండ్ చేసిన గొప్పోడాయన. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం వెనుక కుట్ర వుందనీ, ఈ కుట్రలో వైఎస్ జగన్ మీదనే అనుమానాలున్నాయని గళం విప్పిన చాలామంది నాయకుల్లో బొత్స సత్యనారాయణ కూడా ఒకరు. అంతేనా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద, వైఎస్ విజయమ్మ మీదా నానా రకాల ఆరోపణలు చేశారు.
పార్టీ మారగానే గొంతు మారిపోయింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గొప్ప నాయకుడిగా కీర్తించేస్తున్నారు బొత్స సత్యనారాయణ. ఏ పార్టీ పంచన వుంటే, ఆ పార్టీ అధినేతకి బాకా ఊదడంలో లబ్దప్రతిష్టుడైన బొత్స సత్యనారాయణకి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని చూస్తే నవ్వొస్తోందట. చంద్రబాబు – పవన్ కళ్యాణ్ కలిస్తే తమకేంటి నష్టమని అంటున్నారు. ఇంకా చాలా చాలానే సైటైర్లు వేసేశారు జనసేన మీదా, పవన్ కళ్యాణ్ మీదా.
టీడీపీ – జనసేన కలుస్తాయా.? కలవవా.? అన్నది వేరే చర్చ. అసలంటూ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదన్న ప్రశ్నకు సమాధానం చెప్పడమే చేతకావడంలేదు మంత్రి బొత్స సత్యనారాయణకి. ‘మూడు రాజధానులకు కట్టుబడి వున్నాం..’ అని బొత్స సత్యనారాయణ ఇంకోసారి బల్లగుద్ది మరీ సెలవిచ్చారు.
కట్టుబడి వుండటమంటే, రాజధాని లేదా రాజధానుల్ని కట్టకుండా కాలయాపన చేయమనా అర్థం.? ఇప్పుడు అమరావతి అభివృద్ధికి ఎలాంటి అడ్డంకులూ లేవు. మూడు రాజధానులకు కట్టుబడి వున్నారు గనుక, అందులో ఒక రాజధాని అయిన అమరావతిని అభివృద్ధి చేయొచ్చు కదా.?
రెండున్నరేళ్ళుగా రాష్ట్రానికి రాజధాని ఏది.? అన్న ప్రశ్నకు సమాధానం తెలియనంతగా రాష్ట్రాన్ని నాశనం చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎవరి మీదనైనా సెటైర్లు వేసే నైతిక హక్కు వుందా.? మంత్రులట, ముఖ్యమంత్రి అట.. రాజధాని పట్ల ఇంతటి బాధ్యతారాహిత్యం ప్రదర్శించేవాళ్ళని పాలకులని అనగలమా.? నవ్వొస్తుంది.. ఎందుకు రాదు, అధికారంలో వున్నారు కదా.. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు కదా.. పైశాచికానందంతో నవ్వు రాకుండా వుంటుందా.? స్మశానం, ఎడారి.. అన్న ఆ అమరావతి నుంచే పరిపాలన చేస్తున్నందుకు నవ్వు రాకుండా ఎందుకుంటుంది.?