సంక్రాంతి పండక్కి ఉభయ గోదావరి జిల్లాల్లో సంబరాలు అంబరాన్నంటాయ్. ప్రతి యేడాదీ అంతే.. సంక్రాంతికి పొరుగు జిల్లాల నుంచీ, పొరుగు రాష్ట్రాల నుంచీ, ఆ మాటకొస్తే ఇతర దేశాల నుంచి కూడా జనం పెద్దయెత్తున తరలి వస్తుంటారు ఉభయ గోదావరి జిల్లాలకి.
కేవలం కోడి పందాల కోసమేనా.? అంటే, అదీ ఓ కారణం కావొచ్చుగానీ, సంక్రాంతి సీజన్‌లో కోనసీమ అందాల్ని చూడాలంటే పెట్టిపుట్టాలంటారు. అదీ అసలు సంగతి. ఉభయ గోదావరి జిల్లాల్లో ‘మర్యాదలు’ మళ్ళీ వేరే లెవల్.
అయితే, వైసీపీ హయాంలో ఉభయ గోదావరి జిల్లాల్లో రోడ్ల దుస్థితి నేపథ్యంలో పండక్కి ఊరెళ్ళడానికి, ఇతర రాష్ట్రాల్లో, ఇతర జిల్లాల్లో స్థిరపడ్డ ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ప్రజలూ భయపడిన పరిస్థితిని చూశాం.
కానీ, ఇప్పుడు వ్యవహారం వేరే వుంది. రోడ్లన్నీ తళతళ మెరిసిపోతున్నాయ్. దాంతో, రయ్యి రయ్యి మని దూసుకెళ్ళిపోయారు ఉభయ గోదావరి జిల్లాల్లోని రోడ్ల మీద పండగ జనం. దానికి తోడు కోడి పందాలు సహా, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు సజావుగా, ఎలాంటి వివాదాలూ లేకుండా నడిచాయి. గతంతో పోల్చితే, ఈసారి రాజకీయ అక్రమ వసూళ్ళు కూడా పెద్దగా ఏమీ లేవన్న చర్చ ఉభయ గోదావరి జిల్లాల్లో కనిపించింది.
ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, సంక్రాంతి సంబరాల్లో జనసేన పార్టీ శ్రేణుల హంగామానే ఎక్కువగా కనిపించడం గమనార్హం. ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన తప్ప మరో పార్టీ లేదా.? అన్న చర్చ కూడా జరిగిందంటే అది అతిశయోక్తి కాదేమో.
జనసేన శ్రేణులతో పాటు, కూటమిలోని బీజేపీ, టీడీపీ శ్రేణుల హంగామా కూడా కొన్ని చోట్ల కనిపించినమాట వాస్తవం. అయితే, ఎక్కడా వైసీపీ జెండా లేకపోవడం ఉభయ గోదావరి జిల్లాల్లో ఈసారి కనిపించిన ఆసక్తికరమైన విషయం.
‘పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా’ అంటూ, 2024 ఎన్నికల ఫలితాలకు ముందే మొదలైన ట్రెండ్ కంటిన్యూ అవుతూ వస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కడ చూసినా, ‘పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలూకా’ అన్న బ్యానర్లే పెద్దయెత్తున దర్శనమిచ్చాయ్. ఉభయ గోదావరి జిల్లాల్లో ఫేమస్ అయిన ప్రభల తీర్థాల్లోనూ జనసేన పార్టీకి చెందిన జెండాల హంగామా కనీ వినీ ఎరుగని రీతిలో కనిపించింది. అదే సమయంలో, వైసీపీ జెండా పట్టుకోవడానికి వైసీపీ కార్యకర్తలే భయపడ్డారు. భయపడటంతోపాటుగా మొహమాటపడ్డారు కూడా. కొందరైతే, అసహ్యం ప్రదర్శించారన్న గుసగుసలూ వినిపించాయి. డబ్బులిచ్చి మరీ వైసీపీ ఫ్లెక్సీలు వేయించే ప్రయత్నం చేసినా, వాటిని కట్టేందుకు కూడా ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ సంక్రాంతికి కనిపించింది.
ఇంతలా ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ పట్ల అంత అసహ్యం ఎందుకు పుట్టింది.? అన్నదానిపై ఆసక్తికరమైన చర్చ, పండగ రోజుల్లో పొరుగు ప్రాంతాల నుంచి వచ్చినవారిలో జరిగింది.