నేను లా స్టూడెంటుని.. బాద్యతగల పౌరుడిని.! నా కన్న తల్లిగారు. నాకు ఐదుగురు సిస్టర్స్.! నా భార్య, నా బిడ్డలు.! ‘దేవుడే నా కుటుంబాన్ని కాపాడాలి..’.!
రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ నుంచి ఇలా కొత్త కొత్త మాటలు వినిపిస్తున్నాయి. బోరుగడ్డ అనిల్ అంటే తెలుసు కదా.? గతంలో, యూ ట్యూబ్ ఛానళ్ళలో రెచ్చిపోయాడు, అదీ బూతులతో.! రాయడానికి వీల్లేనంత దరిద్రగొట్టు పదజాలం, బోరుగడ్డ అనిల్ నుంచి వచ్చేది.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రోద్బలంతో చెలరేగిపోయిన సంఘ వ్యతిరేక శక్తుల్లో బోరుగడ్డ అనిల్ కూడా ఒకరు. ‘హ్యాంగర్‌కి వున్న చొక్కా తగిలించుకుని వచ్చేస్తా.. మీ అంతు చూస్తా..’ అంటూ పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నారా లోకేష్ మీద దూషణలకు దిగేవాడు, ‘డెత్ థ్రెట్స్’ కూడా ఇచ్చాడు బోరుగడ్డ అనిల్.
ఇలాంటి వ్యక్తులు సమాజానికి అత్యంత హానికరం.. అని తెలిసి కూడా, అప్పట్లో వైసీపీ కనుసన్నల్లో పోలీస్ వ్యవస్థ చూసీ చూడనట్లు వదిలేసింది. దాంతో, బోరుగడ్డ అనిల్ మరింతలా చెలరేగిపోయాడు.
పవన్ కళ్యాణ్ ఇంట్లోని మహిళలపైనా, చంద్రబాబు అలాగే లోకేష్ కుటుంబ సభ్యుల్నీ.. అత్యంత హేయంగా దూషించాడు, వాళ్ళని చంపేస్తాననీ, వారిపై అఘాయిత్యాలకు తెగబడతానని బోరుగడ్డ అనిల్ రెచ్చిపోవడం చూశాం.
దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూనే వున్నాయి.
కట్ చేస్తే, బోరుగడ్డ అనిల్ అరెస్టయ్యాడు. కానీ, మధ్యంతర బెయిల్ మీద విడుదలయ్యాడు. ఎప్పుడు విడుదలయ్యిందీ ఎవరికీ తెలియదు. ఇప్పుడెక్కడ వున్నాడో కూడా పోలీసులకు అర్థం కాని పరిస్థితి. మధ్యంతర బెయిల్ అంటే, పోలీసుల కళ్ళుగప్పి తిరగడానిక వీల్లేదు.
ఇదిలా వుంటే, తాజాగా బోరుగడ్డ అనిల్ ఓ వీడియో విడుదల చేశాడు. అందులో, పైన పేర్కొన్నట్లు చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాడు.. కుటుంబ సభ్యుల గురించి. అంతే కాదు, చంద్రబాబునాయుడుగారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు.. అంటూ, ‘గారు’ తగిలించి గౌరవంగా ప్రస్తావిస్తున్నాడు బోరుగడ్డ అనిల్.
అయితే, ఆ ముగ్గురి నుంచి తనకు ప్రాణ హాని వుందంటూ, బోరుగడ్డ అనిల్ ఆరోపిస్తుండడం గమనార్హం. నిజానికి, బోరుగడ్డ అనిల్ నుంచే, చంద్రబాబుకి అయినా, పవన్ కళ్యాణ్ అలాగే నారా లోకేష్‌కి అయినా ప్రాణ హాని వుంది.
ఈ విషయాన్ని పోలీసులు ఒకింత సీరియస్‌గా తీసుకోవాల్సి వుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపై బోరుగడ్డ అనిల్ అఘాయిత్యాలకు పాల్పడే ప్రమాదమూ లేకపోలేదు. ఆయన గతంలోనే, డెత్ థ్రెట్స్ ఇచ్చిన దరిమిలా, పోలీసులు, అతన్ని బయట తిరగకుండా జైల్లోనే వుండేలా చూసుకోవాల్సి వుంటుంది.
తల్లి, చెల్లి, భార్య, బిడ్డలు.. అంటున్నాడుగానీ, బోరుగడ్డ అనిల్ కారణంగా, అతని కుటుంబ సభ్యులకే అతని కారణంగా ముప్పు ఏర్పడే అవకాశం లేకపోలేదు.
అసలు బోరుగడ్డ అనిల్, పోలీసుల కళ్ళు గప్పి ఎలా తిరుగుతున్నాడు.? అతను అలా తప్పించుకు తిరగడానికి, పోలీస్ శాఖలో ఎవరు అతనికి సహకరిస్తున్నారు.? అన్నది తేలాల్సి వుంది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనన్న చర్చ టీడీపీ, జనసేన శ్రేణుల్లో జరుగుతోంది.