Balakrishna: నందమూరి బాలకృష్ణ హీరోగా కొత్త సినిమా తెరకెక్కుతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దసరాకు సినిమాను విడుదల చేయాలని కూడా మేకర్స్ టార్గెట్ పెట్టుకున్నట్టు సమాచారం. సినిమా బాలకృష్ణ ఫ్యాన్స్ ను ఆకట్టుకునే మాస్ అంశాలతో రాబోతోందని సమాచారం. ఈక్రమంలోనే ఫ్యాన్స్ ను మెప్పించేందుకు సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. ఈపాటలో బాలీవుడ్ భామను తీసుకురాబోతున్నట్టు సమాచారం.
ఎంతోమంది కథానాయికల పేర్లు పరిశీలించిన అనంతరం మేకర్స్ బాలీవుడ్ కు చెందిన నటి నర్గీస్ ఫక్రిని స్పెషల్ సాంగ్ కోసం సెలక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి చిత్ర బృందం కూడా ఆమెను కలిసినట్టు తెలుస్తోంది. నర్గీస్ కూడా ఈ స్పెషల్ సాంగ్ కు అంగీకారం తెలిపినట్టుగా చెప్తున్నారు. బాలకృష్ణ సినిమాల్లో ఇటివల స్పెషల్ సాంగ్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబినేషన్లోనే వచ్చిన వీరసింహారెడ్డి సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ ‘మా బావ మనోభావాలు’కు చంద్రికా రవిని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
సినిమాలో బాలకృష్ణకు జోడీగా నయనతార నటిస్తున్నారు. సమకాలీన అంశాలను మేళవించి సినిమాను కమర్షియల్ గా తెరకెక్కిస్తున్నారు. మొదటగా చారిత్రక నేపథ్యం ఉన్న కథతో సినిమా తెరకెక్కించాలని భావించినా బడ్జెట్ సమస్యలతో వెనక్కు తగ్గినట్టు వార్తలొచ్చాయి. ఇప్పుడు బాలకృష్ణకు సరిపడా మాస్ కథతో గోపీచంద్ ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్లో వెంకట సతీశ్ కిలారు సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.
