రాజకీయాలు వేరు, సినిమాలు వేరు.. అనుకోవడానికి బాగానే వుంటుంది. కానీ, రెండిటినీ వేర్వేరుగా చూడలేని పరిస్థితి వచ్చేసింది. రాజకీయ కుట్రలతో సినిమాల్ని అడ్డుకునే రాక్షసత్వం, అసహనం అధికారంలో వున్నవారికి పెరిగిపోయింది. ‘వకీల్ సాబ్’ సినిమా విషయంలో కావొచ్చు, ‘భీమ్లానాయక్’ సినిమా విషయంలో కావొచ్చు, మంత్రులు నిస్సిగ్గుగా రివ్యూలు, కలెక్షన్ల గురించి మాట్లాడిన వైనాన్ని చూశాం.
సినిమా టిక్కెట్ల ధరల్ని సామాన్యులకు అందుబాటులో వుంచుతారట.. సామాన్యులకు అందుబాటు ధరలో వుంచాల్సిన నిత్యావసర వస్తువుల ధరల్ని పెంచుతారట. ఇదీ పరిపాలన.! ఇదీ బులుగు పైత్యమంటే. ‘రాజకీయాలు వేరు, సినిమాలు వేరు..’ అని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంటే, అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీ.
పవన్ కళ్యాణ్ ఆర్థిక మూలాలు దెబ్బకొట్టడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ ప్రయత్నిస్తోంది. అధికారాన్ని అడ్డగోలు వ్యవహారాలకు వాడేస్తూ, పవన్ కళ్యాణ్ సినిమాల్ని దెబ్బకొట్టేందుకు ఎలా ప్రయత్నిస్తోందో చూస్తూనే వున్నాం. ఇది చాలదన్నట్టు, తన అనుకూల మీడియా ద్వారా, పవన్ కళ్యాణ్‌కి సినిమాల పరంగా అవకాశాలు రాకుండా చేయాలన్న కుట్ర పన్నుతోంది.
పవన్ కళ్యాణ్ రాజకీయాలతో నిర్మాతలు బలి.. అంటూ వైసీపీ అనుకూల మీడియా కొత్త ప్రచారాన్ని తెరపైకి తెచ్చింది. ఏ నిర్మాత బలైపోయాడు పవన్ కళ్యాణ్ రాజకీయలతో.? సినిమా అంటే వ్యాపారం. పవన్ కళ్యాణ్ సినిమాల వల్ల లాభం లేకపోతే, ఏ నిర్మాత కూడా ఆయనతో సినిమాలు తీయడానికి ముందుకు రాడు. కానీ, పవన్ చేతి నిండా సినిమాలున్నాయంటే దానర్థమేంటి.? అది జీర్ణించుకోలేక, బులుగు పైత్యాన్ని బలవంతంగా రుద్దేందుకు వైసీపీ అనుకూల మీడియా పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు.
అటు రాజకీయాలు, ఇటు సినిమాల్ని పవన్ కళ్యాణ్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు నిర్మాతల నుంచీ సంపూర్ణ సహాయ సహకారాలు అందుతున్నాయి. సినిమా వేరు, రాజకీయం వేరు.. అని నిర్మాతలు భావిస్తున్నారు, పవన్ కళ్యాణ్‌తో సినిమాలు చేయడం ద్వారా తమ నిర్మాణ సంస్థల ప్రతిష్ట మరింత పెరుగుతుందన్న నమ్మకంతో ఆయనతో సినిమాలు చేస్తున్నారు.
గెలిచినా, ఓడినా నేనెప్పుడూ ఒకేలా వుంటాను.. అని మాటల్లో చెప్పడమే కాదు, చేతల్లో చూపించిన పవన్ కళ్యాణ్ ముందర ఇలాంటి ఉడత ఊపుల వల్ల ప్రయోజనం వుండదని బులుగు మీడియా ఎప్పుడు తెలుసుకుంటుందో ఏమో.!