అమరావతి: ఉత్తరాంధ్ర పారిశ్రామిక అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడుతోంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని సెజ్‌లో ప్రముఖ ఔషధ తయారీ సంస్థ బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలో ఫార్మా రంగానికి ఇది మరింత బలం చేకూర్చే పెట్టుబడిగా భావిస్తున్నారు.
మహారాష్ట్రలో ప్రధాన కార్యాలయం కలిగిన బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ శాస్త్ర ఆధారిత ప్రత్యేక ఔషధాలు, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల తయారీలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సంస్థ. రాంబిల్లి సెజ్‌లో ఫార్మాస్యూటికల్, ఇంటర్మీడియట్, కాంట్రాక్ట్ డెవలప్‌మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ పరిశ్రమ ఏర్పాటుతో ఉత్తరాంధ్రలో ఫార్మా తయారీ రంగం మరింత విస్తరించనుంది.
ఈ ప్రాజెక్టు కోసం కూటమి ప్రభుత్వం అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం జడ్.చింతువ రెవెన్యూ పరిధిలోని సీతపాలెం వద్ద సెజ్‌లో రెండో విడతగా సేకరించిన భూముల్లో 102.48 ఎకరాలను కేటాయించింది. ఎకరానికి రూ.40 లక్షల ధరకు భూమి కేటాయించడంతో పాటు అవసరమైన ప్రోత్సాహకాలను కూడా మంజూరు చేసింది. మొత్తం రూ.2,300 కోట్ల పెట్టుబడితో ఈ పరిశ్రమను దశల వారీగా అభివృద్ధి చేయనున్నారు.
2028-29 ఆర్థిక సంవత్సరానికి బ్లూ జెట్ హెల్త్ కేర్ తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 1,750 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు లభించనున్నాయి. పరోక్షంగా మరిన్ని ఉపాధి అవకాశాలు సృష్టించబడే అవకాశం ఉంది. స్థానిక యువతకు ఉపాధి కల్పనతో పాటు ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు ఇది పెద్ద ఊతమివ్వనుంది.
రాంబిల్లి సెజ్‌లో ఈ భారీ ఫార్మా పరిశ్రమ స్థాపనతో అనుబంధ పరిశ్రమలు, సరఫరా గొలుసు సంస్థలు, లాజిస్టిక్స్ రంగం కూడా అభివృద్ధి చెందనున్నాయి. ఉత్తరాంధ్రను అధునాతన ఔషధ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఈ పెట్టుబడి కీలకంగా మారనుందని ప్రభుత్వం భావిస్తోంది. పారిశ్రామిక వృద్ధి, ఉద్యోగాల కల్పన, ఎగుమతుల పెరుగుదల దిశగా ఈ ప్రాజెక్ట్ రాష్ట్రానికి మైలురాయిగా నిలవనుంది.
