ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం చిత్ర విచిత్రంగా వుంటుంది. చాలాకాలం నుంచీ ఈ పైత్యాన్ని చూస్తూనే వున్నాం. రాజకీయ పార్టీలే కాదు, రాజకీయ మీడియాతోనూ పోరాడాల్సి వస్తుంటుంది జనసేన లాంటి రాజకీయ పార్టీలకి.
టీడీపీ – జనసేన కలిసి వచ్చే ఎన్నికల్లో పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్నది జనసేనాని పవన్ కళ్యాణ్ ఉద్దేశ్యం. 2019 ఎన్నికల్లో ఓటమి చవిచూసినప్పటినుంచీ జనసేన మీదకి వలపు బాణాల్ని విసురుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.
టీడీపీ వన్ సైడ్ లవ్ గురించి తొలుత లైట్ తీసుకున్న జనసేనాని, కొన్నాళ్ళ క్రితం జనసేన పార్టీకి సంబంధించిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటినుంచి కథ మారింది. సరే, రాజకీయాలన్నాక వ్యూహ, ప్రతివ్యూహాలుంటాయి.
రాష్ట్రాన్నీ, రాష్ట్ర ప్రజల్నీ వైసీపీ పాలన నుంచి కాపాడాల్సిన బాధ్యతని భుజానికెత్తుకున్న జనసేనాని, ఈ క్రమంలో టీడీపీ మద్దతుని కోరుతున్నారు. ఎన్నికల్లో గెలిచాక, గెలిచిన సీట్లను బట్టి ముఖ్యమంత్రి పదవి ఎవరిదన్నదానిపై మాట్లాడుకోవచ్చన్నది జనసేనాని ఉవాచ. అదే మాటకు కట్టుబడి జనసైనికులు, జనసేన నేతలు వ్యవహరిస్తున్నారు.
తాజాగా, జనసేన కీలక నేత నాగబాబు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో టీడీపీ మీద ఎవరూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయవద్దని, రెండు పార్టీలూ కలిసి పని చేస్తున్నాయని చెప్పారు. దీన్ని బ్లూ మీడియా వక్రీకరించింది. ఈ వక్రీకరణని సాకుగా తీసుకుని, పచ్చ మీడియా సుద్దులు చెప్పేందుకు ప్రయత్నించింది.
నాగబాబు గతంలో కమ్మ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా పని చేశారన్నది పచ్చమీడియా ఉవాచ. టీడీపీతో జనసేన కలిసి పనిచేస్తున్నా, పచ్చ మీడియా ఎందుకీ పైత్యం ప్రదర్శిస్తోంది.? అన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్ ఏమీ కాదు. పచ్చ పార్టీకి అనుబంధంగా కొనసాగుతూనే, ఆ పచ్చ పార్టీని నాశనం చేయాలని కంకణం కట్టుకుంది పచ్చ మీడియాలో ఓ వర్గం. అదే అసలు సమస్య.
కాగా, బ్లూ మీడియా వెకిలి రాతల్ని నాగబాబు తీవ్రంగా ఖండించారు. ‘నేను చెప్పిందేంటి.? మీరు రాసిన రాత ఏంటి.? మీడియా ఇంత ఛండాలంగానా.?’ అంటూ నాగబాబు క్లాస్ తీసుకున్నారు. ఎన్ని క్లాసులు తీసుకున్నా బ్లూ మీడియా మారదు. పచ్చ మీడియా అసలే మారదు.
టీడీపీతో కలిసి పని చేస్తున్నా, టీడీపీ అను‘కుల’ మీడియాని ఫేస్ చేయడమే జనసేనకు పెద్ద టాస్క్ అవుతోంది. బ్లూ మీడియాతో జనసేన పంచాయితీ ఎప్పుడూ కొనసాగుతూనే వుంటుందనుకోండి.. అది వేరే వ్యవహారం.