పవన్ కల్యాణ్ ఇప్పుడు బీజేపీకి సౌత్ ఇండియాలో బలమైన అస్త్రంగా మారబోతున్నారా.. ఇన్ని రోజులు కాస్త అటు ఇటుగా అనుమానాలు ఉండేవి. ఏపీలో తిరుపతి లడ్డూ వ్యవహారం తర్వాత పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష తీసుకోవడంతో పాటు వారాహి సభలో చేసిన కామెంట్లు ఒక్కసారిగా బీజేపీకి మైలేజ్ ను పెంచేశాయి. ముఖ్యంతా బీజేపీ ఇన్ని రోజులు నెత్తిన పెట్టుకుంటున్న సనాతన ధర్మాన్ని ఇప్పుడు పవన్ కల్యాణ్ భుజాన వేసుకున్నారు. ఇన్ని రోజులు సౌత్ ఇండియాలో తమ వాయిస్ ను వినిపించే బలమైన నాయకుడు లేడనే బెంగ బీజేపీలో ఉండేది.
కానీ పవన్ కల్యాణ్ ఎప్పుడైతే సనాతన ధర్మాన్ని కాపాడుతానని భుజాన వేసుకున్నాడో అప్పుడే బీజేపీలో ఆశలు చిగురించాయి. సనాతన ధర్మం కోసం నా జీవితాన్ని, పదవిని అయినా వదులుకుంటానని పవన్ చెప్పారు. అదే సమయంలో గతంలో బీజేపీని సనాతన ధర్మం విషయంలో విమర్శించిన ఉదయనిధి స్టాలిన్ ను, తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఏకి పారేశారు. దాంతో బీజేపీకి సౌత్ ఇండియాల అతిపెద్ద బలం దొరికింది. తెలంగాణలో బండి సంజయ్ లాంటి వారు ఉన్నా.. ఆయనకు ఇంత పెద్ద ఫాలోయింగ్ లేదు. ఇక తమిళనాడులో అన్నామలై ఉన్నా.. ఇంత గట్టిగా హిందూత్వ ఎజెండాను ఆయన ఎత్తుకోవట్లేదు.
ఇటు కర్ణాటకలో అంత పాపులర్ లీడర్ లేడు. అటు కేరళ సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాబట్టి దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన పవన్ కల్యాణ్ ఇంత బలంగా హిందూత్వ, సనాతన ధర్మ ఎజెండాను ఎత్తుకోవడం కచ్చితంగా బీజేపీకి కలిసొచ్చే అంశమే. ఎలాగూ పవన్ పదేండ్లుగా బీజేపీతోనే ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు బీజేపీ నుంచి ఆయన్ను వేరు చేయలేమని జాతీయ మీడియా కూడా చెబుతోంది. ఇలా పవన్ రూపంలో బీజేపీకి సౌత్ ఇండియాలో మరో బలమైన ప్రచార అస్త్రం దొరికినట్టు అయిపోయింది.