బిల్ గేట్స్ అంటే కంప్యూటర్.. కంప్యూటర్ అంటే బిల్ గేట్స్.. ఒకప్పుడు కంప్యూటర్ యుగంలోకి అడుగు పెట్టిన యువతీ యువకులంతా బిల్ గేట్స్ గురించి ఇలానే మాట్లాడుకునేవారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌కి ప్రపంచ వ్యాప్తంగా వున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.
మైక్రోసాఫ్ట్ సంస్థకు దూరమై, గేట్స్ ఫౌండేషన్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు బిల్ గేట్స్ గత కొంతకాలంగా. ఇప్పటికీ ఆయన పలు సాఫ్ట్‌వేర్ కంపెనీలకు సూచనలు, సలహాలు ఇస్తుంటారు.. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఎలా అప్‌డేట్ అవ్వాలో సూచిస్తుంటారు.
అలాంటి బిల్ గేట్స్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి.. అందునా, నిర్మాణంలో వున్న రాజధాని అమరావతికి రావడమంటే ఆషామాషీ వ్యవహారమా.? హైద్రాబాద్‌ని ప్రపంచ సాఫ్ట్‌వేర్ రంగానికి కేంద్ర బిందువుగా మార్చడంలో కీలక పాత్ర పోషించిన చంద్రబాబు, ఆంధ్ర ప్రదేశ్‌లో సాఫ్ట్‌వేర్ రంగాన్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలో బిల్ గేట్స్, అమరావతికి రావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. బిల్ గేట్స్‌కి సాదరంగా ఆహ్వానం పలికారు. బిల్ ేగేట్స్, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు సూచనలు చేశారు.
వ్యవసాయ రంగానికి సంబంధించిన విషయాలపైనా ముఖ్యమంత్రి చంద్రబాబుతో బిల్ గేట్స్ చర్చించారు. ఇదంతా నాణేనికి ఓ వైపు. ఇంకో వైపేమో, బిల్ గేట్స్‌ని తద్వారా చంద్రబాబునీ ఓ వర్గం సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తోంది. అత్యంత జుగుప్సాకరమైన కామెంట్స్ చేస్తోంది.
ప్రపంచాన్ని కుదిపేస్తోన్న ఎప్‌స్టీల్ ఫైల్స్ వ్యవహారంలో బిల్ గేట్స్ పేరు తెరపైకి వచ్చిన దరిమిలా, అది ఆ వర్గానికి ఆయుధంగా మారింది. రాష్ట్రాభివృద్ధి కోసం బిల్ గేట్స్ లాంటి వ్యక్తుల సూచనల్ని, సలహాల్ని తీసుకోవడం తప్పెలా అవుతుందన్న ఇంగితం ఆ వర్గంలో కొరవడుతోంది.
ట్రోలింగ్ వ్యవహారమెలా వున్నా.. బిల్ గేట్స్, అమరావతి పర్యటన.. హాట్ టాపిక్‌గా మారిందన్నది నిర్వివాదాంశం.
