లవ్ అంటాడు.. క్రష్ అంటాడు.. అక్క అంటాడు.. అసలేందిది బిగ్ బాస్.? బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో అంటేనే అంత.! ఇద్దరు కంటెస్టెంట్ల మధ్య ఏదో ఒక లింకు పెడితే తప్ప, సీజన్ నడవదు.. అన్నట్లుగా బిగ్ బాస్ నిర్వాహకులు వ్యవహరిస్తుంటారు. ఆ రిలేషన్ ఫేక్ అని అందరికీ తెలుసు.. ఆ డ్రామా పండదనీ తెలుసు. కానీ, అదంతే.
బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఎనిమిదో సీజన్‌లో విష్ణుప్రియ – పృధ్వీ మధ్య కథ నడుస్తోంది. కొత్తగా రోహిణి – గౌతమ్ మధ్య కెమిస్ట్రీ షురూ అయ్యింది. ఇంకోపక్క యష్మి – గౌతమ్ మధ్య ఇంకో వ్యవహారం.! ‘అక్కా.. అని నన్ను పిలవొద్దు గౌతమ్’ అంటూ యష్మి గుస్సా అవుతోంది. ‘నీ మీద నాకు క్రష్ ఏర్పడింది’ అని గౌతమ్ ఒప్పుకుంటున్నాడు. అలాంటోడు, యష్మిని అక్కా.. అని ఎలా పిలవగలుగుతాడు.? మామూలుగా అయితే పిలిచే ఛాన్స్ వుండదు.
పోనీ, ‘అక్కా’ అని అన్నాడు.! అందులో తప్పేం కనిపించింది యష్మికి.? ‘అక్క’ అని పిలిస్తే, తనకు ఏదో అయిపోతుందట. తన సమస్యలు తనకున్నాయని యష్మి చెబుతోంది. పోనీ, గౌతమ్ మానెయ్యొచ్చు కదా.! మానేశాననీ చెబుతున్నా, గౌతమ్‌ని అదే పాయింట్ మీద యష్మి ‘పోక్’ చేస్తుండడాన్ని ఏమనుకోవాలి.?
ఇంకేమనుకుంటాం.? నామినేషన్ ఎపిసోడ్‌లో స్టఫ్ కోరినట్లున్నాడు బిగ్ బాస్.. గౌతమ్ ఇవ్వాల్సిందంతా ఇచ్చేశాడు. ఏమాటకామాటే చెప్పుకోవాలంటే.. యష్మి మీద గౌతమ్‌దే పై చేయి అయ్యింది ఈ రోజు (నవంబర్ 4 ఎపిసోడ్‌లో). యష్మి చేతులెత్తేసింది. దాదాపుగా ఓటమికి అంగీకరించేసినట్లే.
ఇంకో హీటెడ్ ఆర్గ్యుమెంటట్ హరితేజ – ప్రేరణ మధ్య జరిగింది. పరస్పరం నామినేట్ చేసుకున్నారు. హరితేజ కావాలనే ప్రేరణని టార్గెట్ చేసింది. ప్రేరణ బాగానే కౌంటర్ ఎటాక్ ఇచ్చింది. చివరికి హరితేజ చేతులెత్తేయాల్సి వచ్చింది. ప్రేరణ పాయింట్ ‘వాలీడ్’ అనిపించింది చూసేవాళ్ళకి.
నిజానికి, హరితేజకి తెలుగు బాగా వచ్చు.. తెలుగమ్మాయ్ కూడా. ప్రేరణ అలా కాదు, బెంగళూరు అమ్మాయ్. కానీ, తెలుగు బాగానే మాట్లాడుతుంది. హరితేజని ప్రేరణ తన మాటలతో ఔట్ చేయడమన్నది చిన్న విషయం కాదు. ఇక్కడ హరితేజ, చాలా ఈజీగా దొరికేసింది ప్రేరణకి. ‘నువ్వు నన్ను కెలక్కుండా, నేనెప్పుడూ నిన్ను ట్రిగ్గర్ చేయలేదు’ అని ప్రేరణ చెప్పిన మాటకి, లాక్ అయిపోయింది హరితేజ.
మిగతా ఆర్గ్యుమెంట్స్ అన్నీ చప్పచప్పగానే సాగాయ్. విష్ణుప్రియ షరామామూలుగానే చెత్త నామినేషన్ చేసింది, ఆమెను నామినేట్ చేసినప్పుడు ‘అంగీకరించేసింది’.!
చివర్లో మెగా చీఫ్ అవినాష్, నామినేట్ అయినవారి నుంచి ఒకర్ని సేవ్ చేసే అవకాశమొస్తే, రోహిణిని సేవ్ చేశాడు. నామినేట్ అవని సభ్యుడ్ని నామినేట్ చేయాల్సి వస్తే, నిఖిల్‌ని నామినేట్ చేశాడు. వెరసి, కొంత హీటెడ్ ఆర్గ్యుమెంట్ వున్నా, ఓవరాల్‌గా చూస్తే.. ఈ రోజు ఎపిసోడ్ చప్పగానే సాగింది.
నామినేట్ అయిన సభ్యుల్ని ఓ కుర్చీలో కూర్చోబెట్టి, పై నుంచి బ్లాక్ కలర్ పోయించాడు బిగ్ బాస్.! ఇదేం పైశాచికానందమో ఏమో.!
అన్నట్టు, హరితేజ – ప్రేరణ ఎలాగైతేనేం ప్యాచప్ అయిపోయారు. ఇకపై ఒకరినొకరు టార్గెట్ చేసుకోబోమనీ, ట్రిగ్గర్ అస్సలే చేసుకోబోమనీ చెప్పుకున్నారు. కానీ, మాట మీద నిలబడతారా.? అదైతే ప్రస్తుతానికి మిలియన్ డాలర్ క్వశ్చన్.
ఆటలో అరటిపండులా మారిపోయిన గంగవ్వ.. ఎందుకు నామినేట్ చేసిందో ఆమెకే తెలియదు. ఆమె మాటలు ఎవరికీ అర్థం కాలేదు కూడా.!