బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుకుంటుండడంతో ఫైనల్స్ కు ఎవరు చేరతారు అన్న విషయంలో సస్పెన్స్ ఎక్కువవుతోంది. రోజురోజుకూ ఈ టెన్షన్ పెరిగిపోతోంది. ఆదివారం ఎపిసోడ్ లో యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యి అందరికీ షాక్ ఇచ్చాడు. కచ్చితంగా ఫైనల్స్ కు వెళ్తాడు అని తనతో పాటు అందరూ భవిస్తూ వచ్చారు. అయితే రవి ఎక్కడో ఓవర్ కాన్ఫిడెంట్ అయ్యాడేమో, గేమ్ ను లైట్ తీసుకున్నాడేమో అనిపించింది. ఇదే విషయాన్ని రవి కూడా నాగార్జునతో స్టేజ్ మీద ఉన్నప్పుడు ఒప్పుకున్నాడు. ఇక ఎలిమినేషన్ ప్రాసెస్ ఎలా జరిగింది అన్నది ఒకసారి చూసుకుంటే..
శనివారం ఎపిసోడ్ లో ముగ్గురిని సేవ్ చేయడంతో ఇంకా నామినేషన్స్ లో నలుగురు నిలిచారు. షణ్ముఖ్, రవి, ప్రియాంక, కాజల్ లు నామినేషన్స్ లో ఉన్నారు. ట్రైన్ స్టేషన్స్ తో వీరి పేర్లను పెట్టి షణ్ముఖ్ సేఫ్ అయినట్లుగా నాగార్జున ప్రకటించాడు. ఇక ప్రియాంక, కాజల్, రవిలలో ఒక బాక్స్ లో రిబ్బన్ పెట్టి దాన్ని లాగమని చెప్పాడు. అందులో ప్రియాంక సేఫ్ అయినట్లుగా వచ్చింది. ప్రియాంక సేఫ్ అవ్వడాన్ని తనే నమ్మలేకపోయింది. ఇక ఫైనల్ రౌండ్ లో కాజల్, రవిల మధ్య జరగ్గా, సన్నీకి ఉన్న ఎవిక్షన్ ఫ్రీ పాస్ కీ రోల్ ప్లే చేసింది.
రవి, కాజల్ లకు చెరొక మూడు కుండలు ఇచ్చారు. దాన్ని కర్రతో పగలకొట్టాలి. మూడింట్లో ఎక్కువ రెడ్స్ ఎవరికి వస్తే వాళ్ళు ఎలిమినేట్ అయినట్లు. అయితే వాళ్ళు కొట్టడానికంటే ముందు సన్నీకి ఇచ్చిన ఎవిక్షన్ ఫ్రీ పాస్ గురించి డిస్కషన్ నడిచింది. ఆ పాస్ ను తనకోసం దాచుకుంటావా లేక రవి, కాజల్ లలో ఒకరికి ఇస్తావా అని అడిగారు. దీనికి సన్నీ బాగా ఆలోచించి ఎమోషనల్ అయ్యి కాజల్ కు ఇచ్చాడు. తీరా ఆ కుండలు కొట్టి చూస్తే రవికి తక్కువ ఓట్లు వచ్చిన కారణంగా తను ఎలిమినేట్ అయ్యాడు. దీంతో ఎవిక్షన్ ఫ్రీ పాస్ వేస్ట్ అయినట్లే.
అయితే ఇక్కడ కాజల్ తో పాటు సన్నీ కూడా కాజల్ ఎలిమినేట్ అవుతుందని నమ్మాడు. దీంతో కాజల్ కు ఫ్రీ పాస్ ఇచ్చాడు. ఒకవేళ అది రవికి ఇచ్చి ఉంటే పాస్ కు ఉపయోగం ఉండేది. లేదా తన కోసం నెక్స్ట్ వారానికి ఉంచుకోవాల్సింది. అయితే సన్నీ చేసిన పని మంచిదే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఫ్రెండ్షిప్ కోసం సన్నీ నిలిచాడని అభినందిస్తున్నారు.