ఎనిమిది మంది కొత్తవాళ్ళు.. ఎనిమిది మంది పాత వాళ్ళు.. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లో వున్నది వీళ్ళే. కొత్తవాళ్ళంటే, ఈ సీజన్‌లో తొలుత హౌస్‌లోకి వచ్చినవాళ్ళు.. అని అనుకోవాలి. ఎందుకంటే, వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి వచ్చినవాళ్ళకి గత అనుభవాలు బలంగానే వున్నాయ్.
హౌస్‌లో ఏం జరుగుతుందో, ఏం చూపిస్తారో.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినవాళ్ళకి బాగా తెలుసు. కానీ, ఇప్పటికే హౌస్‌లో వున్నవాళ్ళకి అవేమీ తెలియదు. మరి, నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా ఓజీ క్లాన్ సభ్యుల్ని, రాయల్ క్లాన్ సభ్యులు ఏకిపారేస్తుంటే ఎలా.? అది కూడా, హౌస్‌లో వుంటోన్న పద్ధతి గురించి క్లాసు పీకితే ఎలా.?
నయని పావని – విష్ణు ప్రియ మధ్య చిన్నపాటి మాటల యుద్ధం జరిగింది. ఎప్పుడో నీకు నచ్చినప్పుడు చీఫ్ అవుదామనుకుంటే ఎలా.? అప్పటిదాకా పోటీ పడబోనని అంటే ఎలా.? అంటూ, నయని పావని ప్రశ్నించేసింది. విష్ణు ప్రియ, నయని పావనితో పోల్చితే ఎక్కువ వారాలే హౌస్‌లో వుంది. నయని పావని అలా కాదు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి, వెంటనే ఔట్ అయిపోయింది అంతకు ముందు సీజన్‌లో.
బిగ్ బాస్ హౌస్‌లో కొన్నాళ్ళు వుండి వెళ్ళినవారందరికీ, హౌస్‌లో ఏం జరుగుతుందో, బయటకు ఏం చూపిస్తారో స్పష్టంగా తెలుసు. కానీ, నామినేషన్ల వ్యవహారంలో ఏదో ఒకటి మాట్లాడెయ్యాలి.. తప్పదు.! అందుకే, బిగ్ బాస్ ఇచ్చే నామినేషన్స్ టాస్క్ ప్రతిసారీ అడ్డగోలుగా జరుగుతుంటుంది. ఆ తర్వాత మళ్ళీ మామూలే.
అవినాష్ మాట్లాడినా, గౌతమ్ మాట్లాడినా.. మరో కంటెస్టెంట్ మాట్లాడినా, దానికి మిగతా ఎనిమిది మంది కౌంటర్ ఎటాక్ ఇచ్చినా.. ఇదంతా జస్ట్ బిగ్ బాస్ మ్యాజిక్ అంతే. హౌస్ నుంచి ఇప్పటికే ఎలిమినేట్ అయిన సోనియా ఆకుల, ‘నేనేదో నన్ను నేను కొత్తగా చూపించుకునేందుకు.. హౌస్‌లోకి వెళ్ళాను.. అది జరగలేదు సరికదా, నా ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది..’ అంటూ పలు ఇంటర్వ్యూల్లో వాపోతున్న సంగతి తెలిసిందే.
గత సీజన్లలోనూ చాలామంది కంటెస్టెంట్లు ఇలానే ఎలిమినేట్ అయ్యాక మాట్లాడారు. బిగ్ బాస్ అంటేనే అంత.! హౌస్‌లో ఇతర కంటెస్టెంట్లతో గొడవ పెట్టుకోవడం అనేది ఓ ఆర్ట్. అంతకన్నా పెద్ద ఆర్ట్, బిగ్ బాస్‌ని మెప్పించడం.
యష్మి గ్రాఫ్‌నే తీసుకుంటే, అలా పెరిగి.. ఇలా పడిపోయింది. సోనియా ఆకుల మీద ఎలా నెగెటివిటీ ఫామ్ అయ్యిందో, యష్మి విషయంలోనూ అదే జరుగుతోంది. జస్ట్ వ్యక్తులు మారతారంతే. అవే పాత్రలు.. బిగ్ బాస్ డైరెక్షన్‌లోనే అవి హౌస్‌లో మనుగడ సాగించాల్సి వుంటుంది.
అన్నట్టు, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత హౌస్ కొంచెం కళకళ్ళాడుతోంది. డాన్సులేస్తున్నారు. కామెడీ పండిస్తున్నారు. కానీ, ఈ ఉత్సాహం ఎన్ని రోజులు ఇలా హౌస్‌లో వుంటుందో ఏమో చెప్పలేం.
టేస్టీ తేజ అతి వ్యవహారం మాత్రం, ఒకింత చికాకు పుట్టిస్తోంది. హరితేజ సహా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వైపు నుంచి ఎంటర్టైన్మెంట్ అయితే బాగానే వుంది. బిగ్ బాస్ గనుక, ఒకింత ఎంటర్టైనింగ్ టాస్కులు ఇస్తే, ఈ సీజన్ సమ్‌థింగ్ స్పెషల్ అవుతుందన్నది నిర్వివాదాంశం.