నిఖిల్ ఎందుకు ఏడ్చాడు.? యష్మీ ఎందుకు అతన్ని ఓదార్చేందుకు ప్రయత్నించింది.? అసలు యష్మి ఏడవడమేంటి.? పృధ్వీ ఓదార్చడమేంటి.? నేనెందుకు ఏడకూడదన్నట్లు నయని పావని ఎందుకు బోరున విలపించింది.? బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఎనిమిదో సీజన్ అంతా, ఏడుపులమయం.!
ఒకర్ని మించి ఇంకొకరు.. మహా నటులే.! నటులు, నటీమణులు.. వెరసి, ఈ సీజన్ పేరే ‘ఏడుపుగొట్టు సీజన్’ అని పెట్టి వుండాల్సింది. ఏడో సీజన్ కాదు కదా, పేరు కలిసొచ్చేలా ఏడుపుగొట్టు సీజన్‌ని రన్ చేయడానికి.!
చాలా సినిమాల్లో రియాల్టీ షోల మీద సెటైర్లు చూశాం. ఆ సెటైర్లకు తగ్గట్టే ఈ సీజన్ కంటెస్టెంట్లు ఏడుపుతో చెలరేగిపోతున్నారు. ఔను, ఆట తక్కువ.. ఏడుపు ఎక్కు.! దేకడం ఓ టాస్క్, చెట్టు మీద యాపిల్స్ కోయడం ఇంకో టాస్క్. వాటిల్లో గెలిచిన టీమ్‌కి యెల్లో కార్డ్స్ ఇవ్వడం, డైస్ ఇచ్చి దొర్లించమని అడగడం.. ఏంటో, ఈ మాయ.!
సందట్లో సడేమియా.. అన్నట్టు టేస్టీ తేజకీ, విష్ణు ప్రియకీ మధ్య పంచాయితీ.! ‘నేను ఇక హౌస్‌లో వుండటం వేస్ట్..’ అని పలువురు కంటెస్టెంట్లు తమ చికాకునంతా బయటపెడుతన్నారు. కానీ, బయటకు పొమ్మంటే ఎవరూ పోరు.!
ఏ టాస్క్ అయినా, ఛండాలమే.! ఎవరికీ రూల్స్ పట్టడంలేదు. సంచాలక్ ఎలాంటి పిచ్చి డెసిషన్ తీసుకున్నా.. అదే ఫైనల్. కానీ, అది ఫైనల్ అయ్యేదాకా పెద్ద రచ్చ.! ఈ క్రమంలో సంచాలక్ ముందూ వెనుకా నిర్ణయాలు తీసుకోవడం.. వీకెండ్‌లో చీవాట్లు తినడం. ఇదీ వరస.!
‘నేను చూశాను… నువ్వలా దేకావ్..’ అని రోహిణి అంటే, ‘మన టీమ్‌లో వుండి, మన ఆటనే తప్పు పడతావా.?’ అని నయని పావని గట్టిగా క్లాస్ తీసుకుంది. ఇద్దరి మధ్యా వాగ్యుద్ధం జరిగింది. చివరికి నయని పావని ఏడ్చేసింది. ఇదేం ఏడుపు మహాప్రభో.? అని బిగ్ బాస్ వ్యూయర్స్ ముక్కున వేలేసుకున్నారు.
మరోపక్క, నిఖిల్‌ని అనరాని మాట ఏదో అనేసిందట ప్రేరణ. నిఖిల్ – యష్మీ స్నేహితులు కాగా, యష్మి తన టీమ్ కోసం ఆడితే, అది నిఖిల్‌కి నచ్చలేదు. ‘ఇకపై నా గేమ్ నేను ఆడతాను.. ఏ టీమ్ తరఫునా ఆడను..’ అనేశాడు. వెర్రి మాలోకం అంటే ఇదే మరి.!
గుర్తుందా.. ఓ సీజన్‌లో యాపిల్ ఎంత పెద్ద పెంట పెట్టిందో. కౌశల్ విషయంలో యాపిల్ రచ్చ బిగ్ బాస్ రియాల్టీ షో చరిత్రలోనే అతి పెద్ద మచ్చ వేసేసింది. ఆ తర్వాత కూడా యాపిల్స్ వ్యవహారం.. నవ్వులపాలవుతూనే వుంది. ఈ సీజన్‌లోనూ అదే పరిస్థితి.
యాపిల్స్ కోయమంటే, కొమ్మలు పీకేశారు. అలా పీకొచ్చు.. అని కొందరు కంటెస్టెంట్లు కవరింగ్ ఇస్తోంటే, నబీల్ అంత గొంతేసుకుని పడ్డాడు. ప్చ్.. ప్రయోజనం లేకుండా పోయింది. అందరూ తెలుగులో మాట్లాడాలనే నిబంధన వున్నా, ఈ సీజన్‌లో ఇంగ్లీషు మాత్రమే బలంగా వినిపిస్తోంది. తెలుగు అరుదుగా మాట్లాడుతున్నారేమో అనిపిస్తోంది.
ఓవరాల్‌గా ఇదో గందరగోళం ఎపిసోడ్.! అరుపులు కేకలు తప్ప, కంటెంట్ అస్సలు లేదాయె.! ఏడుపుతోనే కంటెస్టెంట్లు తమ అభిమానుల నుంచి ఓట్లను రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారేమో. ఏడుపు ఆపి, ఆట మీద ఫోకస్ పెడితే మంచిది.! కానీ, కంటెస్టెంట్లు ఎనర్జీ పెట్టి ఆడటానికి, బిగ్ బాస్ నిర్వాహకులు సరైన టాస్కులు ఇవ్వాలి కదా.?