అసలు డాక్టర్ గౌతమ్ ఏమన్నాడు.? బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో, ఎనిమిదో సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ‘అశ్వద్ధామ’ని హోస్ట్ అక్కినేని నాగార్జున ఎందుకు ట్రిగ్గర్ చేశాడు.? నిఖిల్ వర్సెస్ గౌతమ్.. ఓ టాస్క్ సందర్భంగా హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. ఈ క్రమంలో ఇద్దరూ ‘నువ్వెంత.. అంటే నువ్వెంత’ అనుకున్నారు.
బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షోలో ఇవన్నీ కామన్.! సీరియస్ విషయాల్ని వదిలేసి, సిల్లీ అంశాలపై వీకెండ్‌లో హోస్ట్ అక్కినేని నాగార్జున పెద్ద క్లాస్ పీకడం కూడా కొత్తేమీ కాదు.! ఇంతకీ, గౌతమ్ ఏమని నిఖిల్ మీద విరుచుకుపడ్డాడు.? అదీ సౌండ్ రాకుండా.?
హౌస్‌లో ఎవరికీ ఆ ‘మాట’ వినిపించలేదు. కేవలం లిప్ సింక్ తప్ప, సౌండ్ లేకపోవడంతో, ‘అన్నాడా.? అనలేదా.?’ అన్నదానిపై అందరికీ అనుమానమే. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద గౌతమ్‌ని క్షమించేస్తున్నట్లు చెప్పాడు హోస్ట్ నాగార్జున. ఈ క్రమంలో నిఖిల్ ఖూడా, గౌతమ్‌కి క్షమాపణ చెప్పేశాడు.
అయితే, బోల్డంత డ్యామేజ్ జరిగిపోయింది గౌతమ్‌కి. హౌస్‌లో మిగతా కంటెస్టెంట్లతో, గౌతమ్ పొరపాటు చేసినట్లే చెప్పించేశాడు హోస్ట్ నాగార్జున. అంతే కాదు, వీకెండ్ షో ప్రత్యక్షంగా చూడ్డానికి వచ్చిన కొందరు ప్రేక్షకులతోనూ అదే మాట చెప్పించిన హోస్ట్ అక్కినేని నాగార్జున, కంటెస్టెంట్ గౌతమ్‌ని దోషిలా నిలబెట్టేశాడు.
నిజానికి, ఇదే మొదటిసారి కాదు.. ఇలా కంటెస్టెంట్లను హోస్ట్ నాగార్జున టార్గెట్ చేయడం. గత సీజన్లలోనూ జరిగింది. ఇప్పుడూ జరుగుతోంది. జూనియర్ ఎన్టీయార్ హోస్ట్‌గా చేసినప్పుడూ, నాని హోస్ట్‌గా చేసినప్పుడూ ఇలాంటివి తప్పలేదనుకోండి.. అది వేరే సంగతి.
ఇక, యష్మికి అక్కినేని నాగార్జున క్లాస్ పీకడం కావొచ్చు, ప్రేరణని ట్రిగ్గర్ చేయడం కావొచ్చు.. వాట్ నాట్.. దాదాపుగా అందరి మొహాలూ పగిలిపోయాయ్.! అదేలెండి, ఫొటోల్ని ముల్లుల గదతో హోస్ట్ నాగార్జున పగలగొట్టేయడమన్నమాట.
మొత్తంగా చూస్తే, గౌతమ్ విషయంలో హోస్ట్ అక్కినేని నాగార్జున నడిపించిన హైడ్రామా, ఓ సినిమాలో ‘చెంబులో చెయ్యెందుకు పెట్టావ్’ అంటూ సాగే కామెడీ సీన్‌ని తలపించింది. కాకపోతే, గౌతమ్ బకరా అయిపోయాడు ఈ మొత్తం ఎపిసోడ్‌లో. సోషల్ మీడియాలో విపరీతమైన నెగెటివిటీ ఆయన చుట్టూ నడుస్తోందిప్పుడు.
ఇదిలా వుంటే, ఈ వారం హౌస్ నుంచి నయని పావని ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ సీజన్ మొత్తం ఆమె ఏడుస్తూనే వుందంటూ, హోస్ట్ నాగార్జున ఓ సర్టిఫికెట్ ఇచ్చేశాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి వచ్చింది నయని పావని. ఈ సీజన్‌లో కాస్త బాగానే ఆడింది.
ఉదయాన్నే డాన్సులు చేయడంలో అయినా, టాస్కుల్లో చిచ్చర పిడుగులా చెలరేగడంలో అయినా.. నయని పావని ఎనర్జీ బాగానే చూపించింది. కానీ, బిగ్ బాస్ ఆమెని కనికరించకపోవడం వల్లే నయని పావని హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతోందని అనుకోవచ్చేమో.!