కూతురి సెంటిమెంట్ గతంలో కౌశల్‌కి వర్కవుట్ అయినట్లు, ఇప్పుడు ఆది రెడ్డికి కలిసి రానుందా.? బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో సీజన్ సిక్స్ విషయంలో ఇప్పుడు సర్వత్రా ఇదే చర్చ జరుగుతోంది. ప్రతి సీజన్‌లోనూ కంటెస్టెంట్లతో వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల్ని కలపడం అనేది ఆనవాయితీగా వస్తోంది.
తాజా సీజన్‌లో కూడా కుటుంబ సభ్యులతో కంటెస్టెంట్లను కలిపారు. ఆది రెడ్డి కోసం ఆయన సతీమణి, కుమార్తె హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో ఆది రెడ్డి తానెలా ఆడుతున్నానంటూ తన భార్యని అడిగితే, చాలా బావుందనీ.. ఏం జరిగినా అంతా మన మంచికేనని చెప్పింది. కుమార్తెతో ఆది రెడ్డి ఒకింత ఎమోషనల్ అయ్యాడు. ఆమె పుట్టినరోజు నేపథ్యంలో హౌస్‌లోకి బర్త్ డే కేక్ కూడా పంపాడు బిగ్ బాస్.
ఇదంతా ఒకింత డ్రమెటిక్‌గానే వున్నా, ఆది రెడ్డి అభిమానులైతే తమ అభిమాన కంటెస్టెంట్ సీజన్ విన్నర్ అయిపోయాడనే ఉత్సాహం ప్రదర్శించేస్తున్నారు అప్పుడే. అప్పుడు కౌశల్.. ఇప్పుడైతే ఆది రెడ్డి.. అంటూ ఆదిరెడ్డి అభిమానులు హంగామా చేస్తున్నారు.
కాగా, మరో టాస్క్‌లో భాగంగా ఆది రెడ్డిని డాన్స్ టీచర్‌గా పేర్కొన్నాడు బిగ్ బాస్. ఫైమాకి ఇంగ్లీష్ టీచర్ పోస్ట్ ఇచ్చేశాడు. ఆ ప్రతిపాదనలే చాలా ఫన్నీగా మారాయి. ఎందుకంటే, ఆది రెడ్డి డాన్స్ చేయలేడు. ఆది రెడ్డి చేసే డాన్సులు ఏ స్థాయిలో నవ్వు పుట్టిస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయినాగానీ, ఈ బిగ్ బాస్ కోచింగ్ సెంటర్ టాస్క్ షరామామూలుగానే బోర్ కొట్టించేసింది.
ఇదిలా వుంటే, తన కుమార్తె బర్త్ డే బిగ్ బాస్ సెట్‌లో జరగడంతో, తాను టైటిల్ గెలిచేసినంత ఆనందంలో వున్నానంటున్నాడు ఆది రెడ్డి. అందులోనూ కొంత నిజం లేకపోలేదు.
మరోపక్క, సీజన్ ముగింపుకు వస్తున్న దరిమిలా, కంటెస్టెంట్ల పీఆర్ టీమ్స్ సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ అవుతున్నాయి. రేవంత్, ఆది రెడ్డి, శ్రీ సత్య, ఇనాయా.. ఒకరేంటి.? దాదాపు అందరికీ పీఆర్ టీమ్స్ చాలా చాలా బాగా పని చేస్తున్నాయి. ఇనాయా పీఆర్ టీమ్స్ అనూహ్యంగా రేసులో ముందుకొచ్చాయిప్పుడు.