పృధ్వీ శెట్టి.. ఎట్టకేలకు బిగ్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు.! బిగ్ బాస్ తెలుగు రియాల్టీ ఎనిమిదో సీజన్‌లో పృధ్వీ ఓ మిస్టీరియస్ కంటెస్టెంట్. ఓ కంటెస్టెంట్‌ని ముందుగా ప్లాన్ చేసుకోగా, అతను చివరి నిమిషంలో హ్యాండివ్వడంతో బిగ్ బాస్ నిర్వాహకులు అప్పటికప్పుడు పృధ్వీ శెట్టిని తీసుకొచ్చారన్న ప్రచారం గతంలో జరిగింది.
అయితే, పృధ్వీ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ అయ్యాక టాస్కుల్లో బాగానే పెర్ఫామ్ చేశాడు. ఓ రకంగా చెప్పాలంటే, రొమాంటిక్ టచ్ ఇవ్వడంలో ఈ సీజన్ వరకూ పృధ్వీ శెట్టిదే పై చేయి మిగతా మేల్ కంటెస్టెంట్లతో పోల్చినప్పుడు. విష్ణు ప్రియతో పృధ్వీ కలిపిన పులిహోర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నిజానికి, పృధ్వీతోనే విష్ణు ప్రియ పులిహోర కలిపిందని అనొచ్చు.
కారణం ఏదైతేనేం, ఇక్కడిదాకా పృధ్వీ శెట్టి రావడం ఓ వింత.. అలాగే, అతను బయటకు వెళ్ళిపోవడం ఇంకో వింత. వెళుతూ వెళుతూ, హౌస్‌లో నిఖిల్ సహా ప్రేరణ, విష్ణు ప్రియ, నబీల్.. తదితరుల్లో ఎవరో ఒకరు టైటిల్ గెలవాలని ఆకాంక్షించాడు పృధ్వీ శెట్టి.
అదే సమయంలో, రోహిణి అలాగే అవినాష్ నామినేషన్లలోకి రావాలంటూ సెటైర్లు వేశాడు. ఈ వారం రోహిణి కూడా నామినేషన్‌లోకి వచ్చింది ఎలిమినేషన్ కోసం. ఆల్రెడీ ఫైనల్ కోసం ఫస్ట్ పోటీ దారుడిగా అవినాష్ సెలక్ట్ అయిపోవడంతో, ఇంకోసారి నామినేషన్ ఎదుర్కొనే అవకాశం లేకుండా పోయింది అవినాష్‌కి.
గతంలో అవినాష్ నామినేట్ అయ్యాడు, ఎలిమినేట్ అయిపోయే పరిస్థితిలో ‘షీల్డ్’ అతన్ని కాపాడింది. ఆ షీల్డ్ నబీల్ ఇచ్చాడు. వెళ్ళిపోతూ ఆ షీల్డ్ ప్రస్తావన తీసుకొచ్చి, అవినాష్‌ని అవమానించాడు పృధ్వీ. మొదటి నుంచీ అవినాష్ అన్నా, రోహిణి అన్నా.. ఆఖరికి గౌతమ్ అన్నా కూడా పృధ్వీకి నచ్చేది కాదు.
ఇదిలా వుంటే, పృధ్వీ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోవడాన్ని విష్ణుప్రియ జీర్ణించుకోలేకపోయింది. గతంలో రాహుల్ – పునర్నవి తరహాలో పృధ్వీ – విష్ణు మధ్య ట్రాక్ నడిచింది. అయితే, రాహుల్ – పునర్నవి ట్రాక్ క్యూటుగా వుంటే, పృధ్వీ – విష్ణు మధ్య ట్రాక్ ఎబ్బెట్టుగా తయారైంది.
నిజానికి, ప్రతికూల పరిస్థితుల్లోనూ రోహిణి, మెగా చీఫ్ టైటిల్ గెలుచుకుని, తానేంటో ప్రూవ్ చేసుకుంది. ఆమె నామినేషన్‌లోకి రావాలనుకోవడం, పృధ్వీ అమాయకత్వం. అవినాష్ – షీల్డ్.. ఇదంతా ఓ ఫేక్ వ్యవహారమని అర్థం చేసుకోలేనంత అమాయకుడైతే కాదు పృధ్వీ.
అవినాష్ హౌస్‌లో ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు.. టాస్కుల్లోనూ బాగా పెర్ఫామ్ చేశాడు. అసలంటూ అవినాష్, రోహిణి లేకపోతే, ఈ సీజన్ అత్యంత చప్పగా సాగేదేమో.! బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఎనిమిదో సీజన్‌కి కాస్తో కూస్తో వ్యూయర్స్ వున్నారంటే అదంతా రోహిణి – అవినాష్ ఎంటర్టైన్మెంట్ వల్లే.!
బయటకు వెళ్ళాక నాలుగు ఫోన్లు తీసుకుని ప్రేరణ, నిఖిల్, నబీల్, విష్ణు ప్రియలకు ఓట్లు వేస్తానని పృధ్వీ చెప్పడం ఒకింత ఆసక్తికరం.