“పెళ్లి చూపులు”, “జార్జ్ రెడ్డి” వంటి హిట్ చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ తో గుర్తింపు తెచ్చుకున్నాడు అభయ్ నవీన్. తెలంగాణలోని సిద్దిపేటకు చెందిన ఈ కుర్రాడు బిగ్ బాస్ హౌస్ లోకి మూడో కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు. ఇంజనీరింగ్ చదివిన నవీన్ కొద్ది రోజులు బ్యాంకు ఉద్యోగిగా పనిచేశాడు. నటన మీద ఆసక్తి ఉండటంతో ఉద్యోగానికి రిజైన్ చేసి యాక్టింగ్ స్కూల్లో చేరి నటనలో ట్రైనింగ్ తీసుకున్నాడు. అలా “బొమ్మలరామారం” అనే సినిమాతో తెరంగేట్రం చేశాడు. పలు సినిమాల్లో యాక్టర్ గా మెప్పించిన నవీన్..సపోర్టింగ్ రోల్స్ కి ఫుల్ స్టాప్ పెట్టి మెగా ఫోన్ పట్టి “రామన్న యూత్” అనే సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవ్వకపోయినప్పటికీ అభయ్ డైరెక్షన్ స్కిల్స్ కి మంచి మార్కులే పడ్డాయి. ఆ సినిమా చూసిన తన తండ్రి తనను హత్తుకుని మెచ్చుకున్నాడంటూ నవీన్ బిగ్ బాస్ స్టేజ్ పై ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత వారం రోజులకే తనకు తన తండ్రి దూరమయ్యాడని చెప్పుకొచ్చాడు.
ఇండస్ట్రీ నుంచి కొద్ది రోజులు గ్యాప్ తీసుకున్న నవీన్ స్వతహాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డిజిటల్ మీడియా వేదికగా గట్టిగానే ప్రచారం చేశాడు. ఆ తర్వాత నేరుగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు. దీంతో పవర్ స్టార్ అభిమానులు సపోర్ట్ కూడా నవీన్ కి దక్కే అవకాశం ఉంది.