బిగ్ బాస్ రియాల్టీ షో దేశంలో ఎప్పటికప్పుడు సంచలనాల్ని సృష్టిస్తూనే వుంది. హిందీలో సల్మాన్‌ఖాన్, తమిళంలో కమల్‌హాసన్ ఈ బిగ్ బాస్ రియాల్టీ షోకి హోస్ట్‌లుగా వ్యవహరిస్తున్నారు. తెలుగులో రెండు సీజన్లకు ఇద్దరు హీరోలు మారారు. మూడో సీజన్ కోసం అక్కినేని నాగార్జున పేరు దాదాపు ఖరారయ్యిందన్న వార్తలు విన్పిస్తోన్న విషయం విదితమే.
ఒక ఇంటిలో వేర్వేరు మనస్తత్వాలున్న వ్యక్తుల్ని బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా వుంచడం ఈ షో ఉద్దేశ్యం. వీక్లీ టాస్క్‌లు, డెయిలీ కార్యక్రమాలు.. అబ్బో, బిగ్‌బాస్ హంగామానే వేరు. ఈ బిగ్ బాస్ కారణంగా హౌస్ మేట్స్ మధ్య లవ్ పుట్టి, వైవాహిక బంధంతో ఒక్కటైనవారూ వున్నారు.. హౌస్‌లో గొడవల కారణంగా రియల్ లైఫ్‌లోనూ బద్ధ విరోధులుగా మారిపోయినవారూ వున్నారు.
తెలుగు సీజన్ విషయానికొస్తే, ప్రస్తుతానికి పెళ్ళిళ్ళ హడావిడి ఏమీ లేదుగానీ, భయానకమైన శతృత్వం అయితే క్రియేట్ అయ్యింది పార్టిసిపెంట్స్ మధ్య. హౌస్‌లో బూతులు, అసభ్యకరమైన ప్రవర్తనలు.. ఇదంతా షరామామూలు తంతు అయిపోయింది. ‘సినిమాల్లో ఇంతకన్నా ఎక్కువే వుంటుంది..’ అంటే, అది వేరే విషయం. మరి, బిగ్ బాస్ సీజన్ 3 తెలుగులో ఎలా వుండబోతోంది.? అంటే, ‘అంతకు మించి’ అంటున్నారు చాలామంది. కంటెస్టెంట్స్ ఎంపికలోనే ఆ ప్రత్యేకతను చూపబోతున్నారట. ఆల్రెడీ కొన్ని పేర్లు విన్పిస్తున్నాయి.
అయితే, కంటెస్టెంట్లు ఎలా వున్నా.. వారిని కంట్రోల్ చేయాల్సింది హోస్ట్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ విషయంలో బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చాడు. కంటెస్టెంట్స్‌ని కంట్రోల్ చేయగలిగాడు. నాని విషయంలో అలా జరగలేదు. విపరీతమైన ట్రాలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది నాని, బిగ్ బాస్ సీజన్ టూ కారణంగా. మరిప్పుడు నాగార్జున గనుక హోస్ట్‌గా ఎంపికైతే పరిస్థితి ఏంటి.?
‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అనే షోని విజయవంతంగా నడపగలిగిన నాగార్జునకి, ‘బిగ్ బాస్ సీజన్ 3’ని నిర్వహించడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. కానీ, ట్రెండ్ మారింది.. ట్రాలింగ్‌ని ఎదుర్కోవడం అక్కినేని నాగార్జునకి పెను సవాల్. పైగా, ‘అత్యంత జుగుప్సాకరం’ అనే మచ్చ పడిపోయిన బిగ్ బాస్ రియాల్టీ షోని, నాగార్జున కాస్తంతయినా క్లీన్‌గా నడిపించగలడా.? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే.