బిగ్‌బాస్ హోస్ట్‌గా అక్కినేని నాగార్జున ఎదుర్కొంటున్న విమర్శలు అన్నీ ఇన్నీ కావు. బుల్లితెరపై హోస్టింగ్ నాగార్జునకి కొత్త కాదు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోని ఆయన రక్తి కట్టించిన తీరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కానీ, ఎందుకో ‘బిగ్‌బాస్’పై నాగార్జున తనదైన ముద్ర వేయలేకపోతున్నాడు. బర్త్ డే సెలబ్రేషన్స్ నేపథ్యంలో గత వారం ఆయన ఈ షోని హోస్ట్ చేయలేకపోయాడు. ఆయన స్థానంలో వచ్చిన వచ్చిన రమ్యకృష్ణ అదరగొట్టేసింది.
మళ్ళీ నాగార్జున యధాతథంగా ఈ వీకెండ్ హోస్ట్‌గా వచ్చేశాడు. అయితే, నిన్నటి ఎపిసోడ్‌లో నాగార్జున హోస్టింగ్ చాలా బోర్ కొట్టించేసింది. ‘రమ్యకృష్ణే బెటర్..’ అని సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది. ఇదంతా నాగార్జున హేటర్స్ చేస్తోన్న నెగెటివ్ ప్రచారమని అక్కినేని అభిమానులు వాపోతున్నారు. గతంలో.. అంటే రెండో సీజన్ నుంచి హోస్ట్ మీద నెగెటివిటీ షురూ అయ్యింది. నాని అప్పట్లో చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ, తన స్టామినా మేరకు ఆ షోని నాని బాగానే నడిపించేశాడు.
ఇప్పుడు మళ్ళీ నాని బిగ్‌బాస్ రియాల్టీ షో స్టేజ్ మీద కనిపించబోతున్నాడు. అదీ తన తాజా సినిమా ‘గ్యాంగ్ లీడర్’ ప్రమోషన్ కోసం. దీనికి సంబంధించి ప్రోమో ఇలా వచ్చిందో లేదో, ‘నాగార్జునని హోస్ట్‌గా పక్కన పెట్టేశారా.? అయితే ఇవ్వాళ బిగ్ బాస్ చూస్తాం..’ అంటూ కొందరు తమ అభిప్రాయాల్ని సోషల్ మీడియాలో వెల్లడిస్తున్నారు. అయినా, నాగ్ పట్ల ఎందుకు ఇంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది.? ఏమోగానీ, అక్కనేని అభిమానులకి మాత్రం ఈ పరిస్థితి అస్సలేమాత్రం మింగుడుపడ్డంలేదు.
Also Read: బిగ్ షాక్: ఈ వీక్ ఎలిమినేట్ అయ్యేదెవరంటే.!
మరోపక్క, బిగ్‌హౌస్‌లో ఎలిమినేషన్ ఈ రోజు జరగబోతోంది. అలీ రెజా, శ్రీముఖి, రవి కృష్ణ, మహేష్ విట్టా ఈ వారం ఎలిమినేషన్ రేసులో వున్నారు. నిన్న రాహుల్ సిప్లిగంజ్ సేఫ్ అయిన విషయం విదితమే. అలీ రెజా ఎలిమినేట్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. మరోపక్క, శ్రీముఖి హేటర్స్ సోషల్ మీడియాలో ఎక్కువైపోతున్నారు. తాజా ప్రోమోలో కంటెస్టెంట్స్ షాక్ అయినట్లు చూపిస్తుండడంతో.. ‘అంతలా అవాక్కవుతున్నారు.. శ్రీముఖి గానీ ఎలిమినేట్ అయ్యిందా.?’ అని సెటైర్లు పడ్తున్నాయి.
