ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సొంత అవసరాల కోసమే ‘రుషి కొండ ప్యాలెస్’ని ప్రజా ధనంతో నిర్మించుకున్నారన్నది నిష్టుర సత్యం.! ‘ముప్ఫయ్యేళ్ళు మనమే అధికారంలో వుంటాం’ అనే అహంకారంతో, ఓ రాజ మహల్‌ని, సీ-వ్యూ వుండేలా రుషి కొండపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్మించుకున్నారు.
‘ఔను, అది జగన్ మోహన్ రెడ్డి నివాసం కోసమే నిర్మిస్తున్నాం. విశాఖే రాజధాని. అందుకే, అక్కడ సీఎం కార్యాలయం, సీఎం నివాసం.. రెండూ కలిసి వుండేలా, ప్యాలెస్ నిర్మిస్తున్నాం..’ అని అప్పటి వైసీపీ మంత్రులు అధికారికంగా ప్రకటించడం చూశాం.
కానీ, ఇప్పుడేమో పర్యాటక శాఖ భవనాలంటూ వైసీపీ కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. ఓడిపోతే, వినిపించాల్సిన ఈ చెత్త వాదనని వైసీపీ గతంలోనే ప్రిపేర్ చేసుకుంది. అధికారిక పత్రాల్లో ‘పర్యాటక శాఖ భవనాలు’గానే పేర్కొంది అప్పటి వైసీపీ ప్రభుత్వం.
తాజాగా, రిషి కొండ ప్యాలెస్‌ని హైకోర్టు బెంచ్ కోసం వినియోగించుకోవాలంటూ, వైసీపీలోని ఓ తల తిక్క బృందం, కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. ఈ మేరకు ప్రభుత్వానికి ఓ ‘పిల్ల’ అల్టిమేటం కూడా జారీ చేసింది.
నిజానికి, రుషి కొండ ప్యాలెస్ దేనికీ ఉపయోగపడదన్నది అంతటా వినిపిస్తోన్న వాదన. రాజమహల్ తరహాలో వైఎస్ జగన్, తన సొంత అవసరాలకోసం నిర్మించుకున్నది తప్ప, ఇంకే రకంగానూ అది ఉపయోగపడేలా కనిపించడంలేదు.
ఫైవ్ స్టార్ హోటల్ నిర్వహణకీ అనుకూలంగా లేదని కొన్నాళ్ళ క్రితం ఈ ప్యాలెస్‌ని సందర్శించిన టీడీపీ, జనసేన, బీజేపీ ప్రజా ప్రతినిథులు తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మితమైన ఈ ప్యాలెస్, ఇప్పుడు ప్రభుత్వానికి ఆర్థిక భారంగా మారింది.
ఇలాంటి పరిస్థితుల్లో రిషికొండ ప్యాలెస్ గురించి, వైసీపీ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. వైసీపీ అధికారం కోల్పోయి, ఉత్తరాంధ్రలో ఆ పార్టీ ‘జాబ్ లెస్’గా మారడానికి, రుషి కొండ ప్యాలెస్ కూడా ఓ కారణమని ఆ పార్టీ ఎప్పుడు తెలుసుకుంటుందో ఏమో.!