బిగ్ బాస్ హౌస్‌లో మేమేం చేస్తున్నామో మాకు తెలుసు.. కానీ, మీకు వాళ్ళు ఏం చూపిస్తున్నారో మాకెలా తెలుస్తుంది.? అంటూ అమాయకంగా ప్రశ్నించేస్తోంది ఇటీవల బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన సోనియా ఆకుల.
నిజమే.. బిగ్ బాస్ హౌస్‌లో జరిగేదానికి భిన్నంగా చూపిస్తుంటారు. జరిగిందే చూపిస్తుంటారుగానీ, దానికి కొన్ని వక్రీకరణలు తోడవుతుంటాయి.. హోస్ట్ నాగార్జున కామెంట్ల రూపంలో కావొచ్చు, మరో రూపంలో కావొచ్చు. పదిహేను మందికి పైగా కంటెస్టెంట్లు.. దాదాపు 100 వరకు కెమెరాలు వున్నప్పుడు.. ఎంత ఫుటేజ్ వుంటుంది.? దాన్ని ఎడిట్ చేసి, ఇరవై నాలుగ్గంటల ప్రసారంలోనూ తమక్కావాల్సిందే బిగ్ బాస్ చూపిస్తుంటాడు.
ఇక, వీకెండ్‌లో హోస్ట్ అక్కినేని నాగార్జున చేసే వ్యాఖ్యలకు అసలు అర్థం పర్థం వుండదు. అది ఆయన చేతుల్లోనూ వుండదు. ఎందుకంటే, స్క్రిప్ట్ ప్రకారమే నాగార్జున నడుచుకోవాలి. ఎలిమినేషన్ నుంచి అభయ్‌ని తప్పించాలని నాగార్జున సూచిస్తే, బిగ్ బాస్ నిర్మొహమాటంగా అతన్ని బయటకు పంపెయ్యడం చూశాం.
సోనియా ఆకుల, నాగార్జునని తప్పు పట్టడం వెనుక బలమైన కారణమే వుంది. అక్కడ జరిగింది వేరు, నాగార్జున చెప్పింది వేరు. అది నా ఇమేజ్‌ని డ్యామేజ్ చేసింది.. అంటూ వాపోయింది సోనియా ఆకుల హౌస్ నుంచి బయటకు వచ్చాక.
లోపల జరిగిందేంటన్నదానిపై తనకు క్లారిటీ లేదనీ, వీకెండ్ ఎపిసోడ్‌లో వివరంగా నాగ్ చెబుతారనుకుంటే, దానికి భిన్నంగా తనను నాగ్ టార్గెట్ చేశారని సోనియా ఆకుల కన్నీరు మున్నీరయ్యింది. అసలే హౌస్ నుంచి చెత్త కంటెంట్ వస్తోంటే, అందులోంచి కొంతైనా కాంట్రవర్షియల్ కంటెంట్ చూపించాలని బిగ్ బాస్ నిర్వాహకులు ఆరాటపడ్డారు. నాగ్ కూడా, సన్నివేశాల్ని రసవత్తరంగా మార్చే ప్రయత్నం చేశాడు.
ఇవి గత సీజన్లలోనూ జరిగాయ్. సోనియా ఆకుల తరహాలో బిగ్ బాస్ మీద ఆరోపణలు చేసిన కంటెస్టెంట్లు చాలామందే వున్నారు. లోపలికి వెళ్ళే ముందర, అదే తమ జీవిత లక్ష్యమని చెప్పే కంటెస్టెంట్లు, బయటకు వచ్చాక.. అదో ఛండాలం.. అనడం కొత్తేమీ కాదు కదా.!
తెలిసే లోపలికి వెళ్ళడం, బయటకు వచ్చాక.. ఇదిగో ఇలా ఏడవడం.. ఇదంతా ఓ ప్రసహనం. తన ఆట తీరు సరిగ్గా లేదని సోనియానే స్వయంగా చెబుతోంది. ఆటకంటే, ఇతరత్రా వ్యవహారాలపైన ఆమె ఫోకస్ పెట్టడం నిజం. ఇతరుల క్యారెక్టర్ మీద అభాండాలు మోపిన సోనియా ఆకుల, తగిన మూల్యమే చెల్లించుకుంది.
అయినా, ఇదంతా నటనే.! హోస్ట్ నాగార్జున కావొచ్చు, కంటెస్టెంట్లు కావొచ్చు.. అందరూ కలిసి తమ నటనతో బిగ్ బాస్ అనే నాటకాన్ని రసవత్తరంగా మార్చేస్తుంటారంతే. వీళ్ళంతా బిగ్ బాస్ చేతిలో జస్ట్ కీలుబొమ్మలంతే.!