బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ సోషల్ మీడియా సెన్సేషన్ అయ్యింది. సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ కూడా, ఆమెకు మద్దతుగా నిలిచారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
చదువుకున్నా ఉద్యోగం రాకపోవడంతో, బర్రెలు కాచుకుంటున్నానంటూ ఓ వీడియో చేసి పాపులర్ అయ్యింది బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ, ఆమె తెగువని ఎవరైనా అభినందించి తీరాలి.
బర్రెలక్క గెలుస్తుందా.? లేదా.? అన్నది వేరే చర్చ. సమాజాన్ని ఆలోచింపజేసింది. యువతలో చైతన్యం నింపింది. ‘ఏం, మనమెందుకు ఎన్నికల బరిలోకి దిగకూడదు.?’ అని యువత ఆత్మవిమర్శ చేసుకునేలా చేయగలిగింది బర్రెలక్క.
అయితే, ఆ బర్రెలక్క పేరు చెప్పి వివిధ రాజకీయ పార్టీలు తమ రాజకీయ ప్రత్యర్థుల్ని ట్రోల్ చేయడం మొదలు పెట్టాయి. అందునా, తెలంగాణలో పోటీ చేయలేక, చేతులెత్తేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన రాజకీయ ప్రత్యర్థి అయిన జనసేన మీద సెటైర్లేస్తోంది.
దాంతో, సహజంగానే జనసేన నుంచి కౌంటర్ ఎటాక్ అంతకంటే తీవ్రమైన స్థాయిలో వస్తోంది. బర్రెలక్క ధైర్యంగా బరిలోకి దిగింది. షర్మిలక్క మాత్రం భయంతో పారిపోయిందంటూ సెటైర్లు పడుతున్నాయి సోషల్ మీడియాలో. వైసీపీ గతంలో తెలంగాణలో ఓ ఎంపీ సీటు, మూడు ఎమ్మెల్యే సీట్లు గెలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తెలంగాణ నుంచి వైసీపీ జెండా పీకేశారనుకోండి.. అది వేరే సంగతి.
‘వైఎస్ జగన్.. నీకంటే బర్రెలక్క బెటర్ కదా..’ అంటూ జనసైనికులు, వైసీపీని ట్రోల్ చేస్తున్నారు. ఏంటో, ఈ మధ్య వైసీపీ సోషల్ మీడియాలో తన రాజకీయ ప్రత్యర్థుల మీద సెటైర్లేసి, తానే అనూహ్యంగా ఇరుక్కుపోతూ వస్తోంది. సోషల్ మీడియాలో వెరీ యాక్టివ్ అయిన వైసీపీ, ఈ మధ్య ఇలా సెల్ఫ్ ట్రోలింగ్‌కి గురవుతుండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.?