హైదరాబాద్ లో ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా భారీ ఫ్లెక్సీలు, హోర్డింగులు వెలిశాయి. జూలై 3వ తేదీన నగరంలోని పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొననున్న నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్స్ పక్కనే ఉన్న టివోలీ ధియేటర్ సిగ్నల్ వద్ద ఫ్లెక్సీలు వెలుగు చూడటం చర్చనీయాంశమైంది.
ఫ్లెక్సీల్లో.. ‘సాలు మోదీ.. సంపకు మోదీ’ అని ఉంది. ఇంకా నోట్ల రద్దు, నల్లధనం వెనక్కు రప్పించడం, రైతు చట్టాలు, ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మకం, అగ్నిపథ్, లాక్ డౌన్.. ఇలా పలు అంశాలను ఫ్లెక్సీల్లో ప్రస్తావించారు. ‘బై బై మోదీ’ అనే హ్యాష్ ట్యాగ్ ను జత పరిచారు. ఇవి ఎవరు ఏర్పాటు చేశారనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు.
ఈ తరహా ఫ్లెక్సీలు, బ్యానర్లు పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లోనూ వెలిశాయి. ఫ్లెక్సీల ఏర్పాటుపై సమాచారం అందుకున్న కంటోన్మెంట్ సిబ్బంది అక్కడకి చేరుకున్నారు. మోదీకి వ్యతిరేకంగా ఉన్న ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించారు.