అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య కాంబినేషన్ లో తెరకెక్కిన బంగార్రాజు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు అయితే బాగానే ఉన్నాయి. మరి బంగార్రాజుతో మరోసారి నాగ్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేయగలడేమో చూడాలి.
కథ:
బంగార్రాజు కథ స్వర్గంలో మొదలవుతుంది. అక్కడ బంగార్రాజు (నాగార్జున) తన భార్య (రమ్య కృష్ణ)తో కలిసి స్వర్గంలో ఎంజాయ్ చేస్తుంటాడు. అయితే తన మనవడు చిన్న బంగార్రాజు (నాగ చైతన్య)కు శివపురం ఊరి సర్పంచ్ (కృతి శెట్టి)తో సమస్యలు ఉన్నాయని తెలుస్తుంది. దీంతో బంగార్రాజు తన భార్యతో కలిసి మళ్ళీ భూమి మీదకు వస్తాడు.
మరోవైపు అదే ఊరి గుడిలో ఉన్న నగలపై కన్నేస్తారు కొందరు. వాటిని చేజిక్కుంచుకోవడానికి ఉన్న ఒకే ఒక్క అడ్డు చిన్న బంగార్రాజు. ఈ నేపథ్యంలో చిన్న బంగార్రాజు సమస్యలను బంగార్రాజు సాల్వ్ చేశాడా? లేదా? దానికోసం ఎలాంటి పరిణామాల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది? అన్నది మిగతా కథ
నటీనటులు:
సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలో బంగార్రాజు పాత్రలో నాగ్ కెరీర్ లోనే బెస్ట్ పాత్రల్లో ఒకటి. ఎప్పటికీ గుర్తించుకునే లాంటి ఎంటర్టైన్మెంట్ ను అందించాడు నాగ్. ఈ నేపథ్యంలో బంగార్రాజు చిత్రంలో నాగ్ మరింత ఎనర్జిటిక్ గా కనిపించాడు. నాగ్ స్క్రీన్ ప్రెజన్స్, తన డైలాగ్ డెలివరీ ఈ చిత్రానికి బాగా ఉపయోగపడతాయి.
మరోవైపు, నాగ చైతన్య చిన్న బంగార్రాజు పాత్రలో మెరుపులు చూపించాడు. బంగార్రాజు మ్యానరిజమ్స్ ను, నాగ చైతన్య పాత్ర ఫాలో అవ్వడం చిత్రానికి బాగానే పనికొచ్చింది. అయితే దానికి మించి చిన్న బంగార్రాజు పాత్ర చేయడానికంటూ ఏం లేకుండా పోయింది. పల్లెటూరి సర్పంచ్ పాత్రలో కృతి శెట్టి బాగానే చేసినా ఆమె పాత్ర తేలిపోయింది.
సోగ్గాడే చిన్ని నాయనలో మెయిన్ పాత్రగా కనిపించిన రమ్య కృష్ణ ఇందులో పూర్తిగా సైడ్ అయిపోయింది. అయితే ఉన్నంతలో తన ప్రత్యేకత చాటుకుంది.
రావు రమేష్, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్, ఝాన్సీ తదితరులు ఆమె పరిధుల మేరకు రాణించారు.
సాంకేతిక నిపుణులు:
అనూప్ రూబెన్స్ సంగీతం పరంగా మెప్పించాడు. క్యాచీ ట్యూన్స్ ఇవ్వడంతో పాటు అవి పిక్చరైజ్ చేసిన విధానం కూడా చిత్రానికి ప్లస్ అయింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ యాప్ట్ గా ఉంది. యువరాజ్ అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకు బోనస్ లా పనికొచ్చింది. ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితీరుని కూడా మెచ్చుకోవాలి. విలేజ్ వాతావరణాన్ని చక్కగా చూపించారు.
కళ్యాణ్ కృష్ణ రాసుకున్న కథ బాగానే ఉంది కానీ సోగ్గాడే చిన్ని నాయన టెంప్లెట్ ను దాదాపుగా ఫాలో అయిపోవడం వల్ల కొత్తదనం లోపించింది.
పాజిటివ్ పాయింట్స్:
- నాగార్జున స్వాగ్
- పల్లెటూరి వాతావరణం
మైనస్ పాయింట్స్:
- నరేషన్
- ఎమోషనల్ కనెక్టివిటీ లేకపోవడం
విశ్లేషణ:
బంగార్రాజు ఒక డీసెంట్ విలేజ్ డ్రామాగా చెప్పుకోవచ్చు. నాగ్ స్క్రీన్ ప్రెజన్స్, సూపర్బ్ ఎనర్జీ చిత్రానికి బాగా పనికొచ్చాయి. మరోవైపు ఎమోషనల్ కనెక్టివిటీ లేకపోవడం, రొటీన్ నరేషన్ చిత్రాన్ని వెనక్కి లాగుతాయి. మొత్తంగా చూసుకుంటే, అంచనాలు అదుపులో ఉంచుకుని వెళితే బంగార్రాజు మిమ్మల్ని మెప్పించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
తెలుగుబులెటిన్ రేటింగ్: 2.75/5