వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఆ పార్టీకి బలమైన దెబ్బ తగిలింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మాజీ సీఎం జగన్ కు పంపించారు. జగన్ విధానాలు నచ్చకనే రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. గత కొంత కాలంగా ఆయన జగన్ తో విభేదిస్తున్నారు. తన అసంతృప్తిని ఎప్పటికప్పుడు పార్టీ ముందు ఉంచుతున్నారు. ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ప్రకాశం జిల్లాలో ఆయనకు వైవీ సుబ్బారెడ్డితో విబేధాలు ఉన్నాయి.
దాంతో పాటు ఆయన్ను గత ప్రభుత్వంలో మంత్రి పదవి నుంచి తీసేయడంతో తీవ్ర అసంతృప్తిలోకి వెళ్లిపోయారు. తన మంత్రి పదవి ఎందుకు తీసేశారంటూ అప్పటి నుంచే ఆయన ఆగ్రహం తెలుపుతున్నారు. జగన్ తో విభేదాలు పెరిగి చివరకు రాజీనామా చేశారు. అయితే రాజీనామాకు ముందు జగన్ తో ఆయన భేటీ అయినా కూడా తన పంతం వదల్లేదు. ఇక రేపు పవన్ కల్యాణ్ తో భేటీ తర్వాత ఆయన జనసేనలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన జనసేన నేతలతో టచ్ లోకి వెళ్లిపోయారని అంటున్నారు.
ఇది జగన్ కు భారీ షాక్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే బాలినేని ప్రకాశం జిల్లాలో చాలా బలమైన నేతగా ఉన్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. రాష్ట్ర రాజకీయాల్లో కూడా ప్రభావం చూపించేంత బలమైన నేతగా ఎదిగారు. అలాంటి నేతను కాపాడుకోవడంలో జగన్ ఫెయిల్ అయ్యారు. బాలినేని వెళ్లిపోతే ఆయన దారిలో మరింత మంది వెళ్లిపోవడం గ్యారెంటీ అని అంటున్నారు.