వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆ పార్టీకి పెద్ద షాకే ఇచ్చారు. వైసీపీని వీడనున్నట్లు సన్నిహితులకు స్పష్టం చేసేశారు.
నిజానికి, ఎన్నికలకు ముందరే బాలినేని వైసీపీని వీడతారనే ప్రచారం జరిగింది. అధినేత జగన్ బుజ్జగింపులతో బాలినేని, ఒకింత మెత్తబడ్డారు. అయితే, ఎన్నికల్లో బాలినేనికి వ్యతిరేకంగా వైసీపీలోనే ఓ వర్గం పని చేసిందని బాలనేని సన్నిహితులు చెబుతుంటారు.
పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత దక్కడంలేదన్నది గత కొంత కాలంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి తన సన్నిహితుల వద్ద వాపోతున్న అంశం. ఈ విషయమై అధినేత జగన్‌తో ఎన్నిసార్లు చర్చలు జరిపినా, పరిస్థితుల్లో మార్పు రావడంలేదని బాలినేని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జగన్ మోహన్ రెడ్డికీ, తనలాంటి నిఖార్సయిన నాయకులకీ మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయిందని, కొందరు చెప్పిన చెప్పుడు మాటలు విని, పార్టీని నాశనం చేసుకున్నారని సన్నిహితుల వద్ద వైఎస్ జగన్ మీద బాలినేని విమర్శలు చేసినట్లు తెలుస్తోంది.
కాగా, జనసేనలోకి వెళ్ళేందుకు గతంలో ప్రయత్నించిన బాలినేనికి, టిక్కెట్ విషయంలో సరైన హామీ దక్కకకపోవడంతో ఆయన ఆగిపోయారని అంటారు. మరి, ఈసారి ఆయన పార్టీ మారితే, ఏ పార్టీలోకి వెళతారు.? అన్నది చర్చనీయాంశంగా మారింది.
టీడీపీలోకి వెళతారా.? బీజేపీ వైపు బాలినేని చూస్తారా.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. వాస్తవానికి పవన్ కళ్యాణ్ అంటే, వ్యక్తిగతంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డికి కొంత సానుకూలత వుంది. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.